చొప్పదండిలో మంత్రి కేటీఆర్ పై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నిరుద్యోగులను బూతులు తిడుతావా..? అంటూ కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కండకావరంతో ఒళ్లు కొవ్వెక్కి మాట్లాడుతున్నవ్.. ఒకసారి ముడుతల చొక్కా.. అరిగిన రబ్బరు చెప్పుల గతాన్ని గుర్తు చేసుకో అంటూ కామెంట్స్ చేశారు. అవినీతిలో బీఆర్ఎస్ కిటీకీలు తెరిస్తే.. కాంగ్రెస్ ఏకంగా తలుపులు బార్లా తెరుస్తుంది అని అన్నారు.
పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల అప్పు చేసిందని, మరి ఆ అప్పు ఎలా తీరుస్తారని ప్రశ్నించారు బండి సంజయ్. కాంగ్రెస్ లో అందరూ ముఖ్యమంత్రులే.. అధికారంలోకి వస్తే మాత్రం కుప్పకూలడం తథ్యం అని విమర్శలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిస్తే అమ్ముడుపోరని కాంగ్రెస్ గ్యారంటీ ఇవ్వగలదా..? అని ప్రశ్నించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఫాంహౌజ్ లు కట్టుకున్నారు.. పేదలకు మాత్రం గూడు కల్పించారా..? అని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం సంగతి ఏమైందన్నారు. ఓటమి ఖాయమని తెలిసి.. సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలను నమ్ముకున్నారని ఆరోపించారు.