కరీంనగర్ సిటీ, వెలుగు: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానమే అని ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసైపై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఒక మహిళా గవర్నర్ ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా బీఆర్ఎస్ నేతలు అవమానించారని గుర్తుచేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడతామంటే ప్రజలు బీఆర్ఎస్ నేతలపై తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు.
లోక్ సభ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుంచే పూరించబోతున్నామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 28న కరీంనగర్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వస్తున్నారని వెల్లడించారు. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో లోక్ సభ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించబోతున్నామని చెప్పారు.
శుక్రవారం సాయంత్రం ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమిత్ షా ఉదయం పాలమూరులో క్లస్టర్ మీటింగ్ లో పాల్గొంటారని, ఆ తరువాత మధ్యాహ్నం ఒంటి గంటకు కరీంనగర్ చేరుకుని కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారని వివరించారు. కరీంనగర్ లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కోసం పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళుతున్నామన్నారు. ఫిబ్రవరి 5 నుంచి కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో యాత్ర ప్రారంభిస్తున్నామని, 20 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందన్నారు.