సీఎం కేసీఆర్కు నేతన్నల కష్టాలు కనిపిస్తలేవా?

యాదాద్రి భువనగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం చేనేత వ్యవస్థను నిర్వీర్యం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో 360 మంది చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం ఆదుకోలేదని ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భూదాన్ పోచంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ సీఎం కేసీఆర్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. పంజాబ్ లో చనిపోయిన 700 మంది రైతులకు సాయం చేసిన కేసీఆర్ కు చేనేత కార్మికుల ఆత్మహత్యలు కనపడలేదా అని ప్రశ్నించారు. 

చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే హామీలన్నీ అమలుచేస్తామని, అన్ని చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేస్తామని స్పష్టం చేశారు. చేసేత కార్మికులు నేసిన ప్రతి వస్త్రాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. గూడు లేని నేతన్నలకు ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాత్ర మరవలేదన్న బండి సంజయ్.. అలాంటి  వ్యక్తిని బతికుండగానే కేసీఆర్ అవమానించారని అన్నారు.