
- మా పార్టీని సీఎం రేవంత్ బ్రిటిషర్లతో పోల్చడం సిగ్గుచేటు: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: అవినీతి పాలనకు కాంగ్రెస్ నిలువెత్తు రూపమని, ఆ పార్టీ కరోనా కంటే ప్రమాదకరమైనదని కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. బీజేపీ.. బ్రిటిషర్ల కంటే ప్రమాదకరమంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయవాద సిద్ధాంతాలు, నిలువెల్లా దేశభక్తిని పుణికిపుచ్చుకున్న బీజేపీని దేశాన్ని దోచుకున్న బ్రిటిషర్లతో పోల్చడం సిగ్గు చేటన్నారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటామంటూ రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతిలాంటిదని మండిపడ్డారు. గడిచిన పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ ఎంతటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందో..15 నెలల కాంగ్రెస్ పాలన అంతకు రెట్టింపు వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లోనే కాంగ్రెస్‌ను గెలిపించలేకపోయారని, సిట్టింగ్ సీటైన మల్కాజ్‌గిరి స్థానాన్ని కూడా నిలబెట్టు కోలేకపోయారని ఎద్దేవా చేశారు.
కామారెడ్డిలో రేవంత్ రెడ్డి బీజేపీ చేతిలో ఓడిపోయి మూడో స్థానానికి పడిపోయారని గుర్తుచేశారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పోటీ చేసే అభ్యర్థులే కరువయ్యారని చెప్పారు. బీజేపీ కంచుకోటైన గుజరాత్ కు వెళ్లి తెలంగాణలో బీజేపీని అడ్డుకునే శక్తి ఉందనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని బండి సంజయ్ మండిపడ్డారు.