కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తేలినా.. ఎందుకు చర్యలు తీసుకుంటలేరు: బండి సంజయ్

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు జరిగాయని కాగ్, విజిలెన్స్ సంస్థలు తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్కక్కై దొంగాట ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు. మార్చి 2వ తేదీ శనివారం కరీంనగర్ జిల్లాలో ప్రజాహిత యాత్రలో భాగంగా జమ్మికుంట మండలం శాయంపేటలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.  విచారణ పేరుతో కాంగ్రెస్ జాప్యం చేస్తూ.. 6 గ్యారంటీల అమలు అంశాన్ని పక్కదోవ పట్టిస్తుందని ఆరోపించారు.

ఇచ్చిన మాట మేరకు వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేసి తీరాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు బండి సంజయ్. తెల్ల రేషన్ కార్డు ఉన్నా.. రూ.500లకు గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలులో కోత పెడుతున్నారని.. రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డు కుటుంబాలుంటే.. 50 లక్షల కుటుంబాలకు కోత పెట్టడం అన్యాయమన్నారు.  వినీతిని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ఎస్ సైతం.. 6 గ్యారంటీల హామీల అమలు కోసం నిలదీయలేకపోతోందన్నారాయన. 

హైదరాబాద్ నుండి కరీంనగర్, రామగుండం రహదారిపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం రక్షణ భూములివ్వడం హర్షణీయమని సంజయ్ అన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టి పెడితే కేంద్రం ఏ విధంగా సహకరిస్తుందో.. ఇదే నిదర్శనమన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్.. కేంద్రాన్ని తిట్టడానికే పరిమితమైందే తప్ప ఏనాడూ అభివ్రుద్ధిపై దృష్టి పెట్టలేదన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా.. కాంగ్రెస్ ఆరోపణలకే పరిమితమైతే తెలంగాణ ప్రజలు నష్టపోతారన్నారు.

తెలంగాణ అభివ్రుద్దికి కేంద్రం పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని.. 10 ఏళ్లలో తెలంగాణలో దాదాపు రూ.10 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చిందని బండి సంజయ్ చెప్పారు. కేంద్రంలో మోదీని మళ్లీ ప్రధానిని చేస్తేనే శక్తివంతమైన భారత్ రూపుదిద్దుకుంటుందన్నారు.  దేశవ్యాప్తంగా బీజేపీకి 350కిపైగా ఎంపీ సీట్లు వస్తాయన్నారు. తెలంగాణలో 17కు 17 ఎంపీ సీట్లు గెలుచుకుంటామనే నమ్మకం ఉందని సంజయ్ చెప్పారు.