కరీంనగర్, వెలుగు: ఆరు గ్యారంటీలను అమలు చేశామని చెబుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌కు.. వాటిని ఎంతమందికి ఇచ్చారో చెప్పే ధైర్యం ఉందా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ క్యాండిడేట్ బండి సంజయ్ సవాల్ విసిరారు. వంద రోజుల్లో ఎంత మంది మహిళలకు రూ.2500 ఇచ్చారు ? ఎంత మంది రైతులకు రూ.15 వేలు, క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇచ్చారని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను అమలు చేశామని కాంగ్రెస్ లీడర్లు కొండగట్టు అంజన్న సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు.
కరీంనగర్‌లోని శుభమంగళ కన్వెన్షన్‌లో గురువారం నిర్వహించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అధ్యక్షులు, మండల ఇన్‌చార్జీల మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. సర్వేలన్నీ బీజేపీ గెలుస్తుందని చెబుతుంటే, బీఆర్ఎస్ క్యాండిడేట్ మాత్రం 3 లక్షల మెజార్టీతో గెలుస్తానని ప్రచారం చేసుకుంటున్నారన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జరిగిన అభివృద్ధి మొత్తం తానే చేశానని ఆయన చెప్పుకుంటున్నారని, ముందు ముందు చార్మినార్, గోల్కొండ కూడా తానే కట్టించానని చెప్పుకుంటాడేమోనని ఎద్దేవా చేశారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. కరీంనగర్ – వరంగల్, ఎల్కతుర్తి – సిద్దిపేట, కరీంనగర్ – జగిత్యాల హైవే పనుల కోసం రూ.వేల కోట్లు తీసుకొచ్చానని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలిద్దరూ ఒక్కటై తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 19న ఒక సెట్, 25న మరో సెట్ నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. ఈ సమావేశంలో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు క్రిష్ణారెడ్డి, ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ, జిల్లా ఇన్‌చార్జి మీసాల చంద్రయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్‌రావు, నాయకులు చెన్నమనేని వికాస్‌రావు, బొమ్మ శ్రీరాం పాల్గొన్నారు.