కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం బయటపడింది : కేంద్ర మంత్రి బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం బయటపడింది : కేంద్ర మంత్రి బండి సంజయ్
  • మొన్న డీలిమిటేషన్, నిన్న వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు
  • కేంద్ర మంత్రి బండి సంజయ్  ఫైర్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్  హైదరాబాద్  మునిసిపల్  కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కు చివరి రోజు అయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్  పార్టీలు వారి అభ్యర్థులను నిలబెట్టకుండా మజ్లిస్  అభ్యర్థికి మద్దతుగా నిలబడ్డాయని, దీంతో ఆ రెండు పార్టీల  ఫెవికాల్  బంధం బయట పడిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్  అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్  పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని శుక్రవారం ఓ ప్రకటనలో ఆయన ఆరోపించారు.

డీలిమిటేషన్  పేరుతో మొన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని, నిన్న వక్ఫ్  బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయని మండిపడ్డారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలు పోటీ చేయాల్సిన 30 చోట్ల మజ్లిస్  పార్టీ పోటీ చేసి గెలిచిందని,  ఇప్పుడు బీసీ జాబితా ముసుగులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో విద్య, ఉద్యోగాల్లో బీసీలకు తీరని అన్యాయం జరగబోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు కలిసి హైదరాబాద్ ను మజ్లిస్  పార్టీ చేతుల్లో పెట్టడానికి సిద్ధమయ్యాయని విమర్శించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్  చీకటి ఒప్పందాలు, కుమ్కక్కు రాజకీయాలపై తెలంగాణ సమాజం ఆలోచించాలని కోరారు. కాళేశ్వరం, విద్యుత్  కొనుగోళ్ల ఒప్పందం, ధరణి పోర్టల్, ఫార్ములా ఈ రేసులో బీఆర్ఎస్ పై కాంగ్రెస్  అవినీతి ఆరోపణలు చేసిందని, ఇప్పుడు గులాబీ పార్టీతో కుమ్మక్కై కేసులను నీరుగార్చిందని ఫైర్  అయ్యారు. కాగా, ఎంఐఎం పార్టీకి భయపడి  కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం లేదని, బీఆర్ఎస్ ఓట్ల రాజకీయం చేస్తున్నదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రా రెడ్డి  అన్నారు. ఐక్యతకు కట్టుబడి ఉన్న బీజేపీకి మద్దతు తెలపాలని కోరారు.