
- ప్రతి నెలా రూ.2,500 హామీ ఏమైంది? : బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: ‘మహిళా శక్తి’ అంటే మహిళా దినోత్సవం నాడే కోట్లాది రూపాయలు ఖర్చు చేసి పత్రికల్లో, టీవీల్లో పెద్ద పెద్ద ప్రకటనలిస్తూ ప్రచారం చేసుకుంటారా? లేక ఆచరణలోకి తెస్తారా? అని కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. స్త్రీలను లక్ష్మీ, సరస్వతి, దుర్గామాతగా పూజించే పార్టీ బీజేపీ అని, ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును ఈ దేశ ప్రథమ పౌరురాలిగా చేసిన పార్టీ బీజేపీ అని వెల్లడించారు. కాంగ్రెస్ నేతలు మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇస్తామన్నారని, 15 నెలలైనా నయాపైసా ఇవ్వలేదని విమర్శించారు.
ఆడ బిడ్డ పెండ్లికి తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీ హామీలు నెరవేర్చలేదన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా.. మహిళా దినోత్సవం నాడే ‘మహిళలను శక్తి’గా మారుస్తామంటూ పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తే నమ్మేదేవరని బండి ప్రశ్నించారు. రాణి రుద్రమాదేవి వారసత్వం పుణికి పుచ్చుకున్న తెలంగాణ మహిళలు చైతన్యవంతులని, మాటలతో మభ్యపెట్టే పాలకులకు కర్రు కాల్చివాత పెట్టడం తథ్యమని హెచ్చరించారు.