రేషన్ మంత్రివి.. ఒక్క రేషన్ కార్డైనా ఇచ్చినవా?: బండి సంజయ్

రేషన్ మంత్రివి.. ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చావా? అంటూ మంత్రి గంగుల కమలాకర్ పై మరోసారి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. 2023, నవంబర్ 21వ తేదీ మంగళవారం కరీంనగర్ నియజకవర్గంలోని చెర్లబూత్కూర్ లో బండి సంజయ్  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "గంగుల.. నిన్నెందుకు గెలిపించాలి?.  బీసీ మంత్రివి.. ఎంత మందికి బీసీ బంధు ఇచ్చినవ్?. వడ్ల మంత్రివి.. తాలు, కటింగ్ పేరుతో క్వింటాలుకు 10 కిలోలు దోచుకుంటావా?. పంట నష్టపోతే పరిహారం ఎందుకివ్వలేదు?. 15 ఏళ్లుగా ఎమ్మెల్యేవి కదా.. పేదలకు ఇండ్లు ఎందుకు ఇవ్వలేదు?. సిగ్గు లేకుండా పేదల ఇండ్లను కూల్చివేయిస్తావా?. అవినీతి పరులెవరో తేల్చుకుందామా?.. ఆస్తులన్నీ ప్రజలకు పంచేందుకు సిద్ధమా?.కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలిద్దరూ.. కబ్జాదారులే. ఇలాంటి వారిని గెలిపిస్తే మీ ఇండ్లను కబ్జా చేస్తారు.  బీజేపీ అధికారంలోకి వస్తే... వరికి మద్దతు ధర రూ.3,100 ఇస్తాం" అని అన్నారు.