కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని ప్రతి మహిళ పేరిట లక్ష రూపాయల చొప్పున బ్యాంకులో జమ చేస్తానని, ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానంటూ రాహుల్ గాంధీ హామీలివ్వడం పెద్ద జోక్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉద్యోగాల సంగతి తరువాత... మీకు దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో 50 శాతం మహిళలకు కేటాయించాలన్నారు. అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదని అర్ధమై.. అడ్డగోలుగా హామీలన్నీ గుప్పిస్తున్నారని విమర్శించారు. గురువారం చొప్పదండి నియోజకవర్గం బోయినిపల్లి మండలం బూరుగుపల్లి ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ పాల్గొని మాట్లాడారు.
ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలకే దిక్కు లేదు.. మహాలక్ష్మీ పథకం కింద ఒక్కో మహిల అకౌంట్లో నెలనెలా రూ.2,500లు జమ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారంటూ మండిపడ్డారు బండి సంజయ్. హామీలకు మోసపోవద్దని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, 6 గ్యారంటీలతోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా వెంటపడతామని హెచ్చరించారు. రైతులకు సబ్సిడీల ద్వారా నరేంద్ర మోడీ.. ఎకరానికి 15 వేల వరకు సహాయం చేస్తున్నారని చెప్పారు. మోదీ మళ్ళీ గెలవకపోతే అన్ని ధరలు పెరుగుతాయి.. రేషన్ లాంటి పథకాలు ఆగిపోతాయని.. దయచేసి అందరూ పువ్వు గుర్తుకు ఓటేసి మోదీనీ గెలిపించండని బండి కోరారు.