తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరెందుకు మార్చారు? : బండి సంజయ్​

తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరెందుకు మార్చారు? : బండి సంజయ్​
  • ఆంధ్రా మూలాలుంటే పేరు మార్చేస్తారా ?: బండి సంజయ్​
  • ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లను మార్చే దమ్ముందా?
  • కులాభిమానంతోనే సురవరం పేరును సీఎం ప్రతిపాదించారని ఆరోపణ

కరీంనగర్/ రాజన్నసిరిసిల్ల, వెలుగు: పొట్టిశ్రీరాములు పేరిట ఉన్న తెలుగు విశ్వవిద్యాలయానికి ఆ పేరు తొలగించాల్సిన అవసరం ఏముందని రాష్ట్ర సర్కారును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు పేరు తొలగిస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు భాష ఉన్నతికి కృషి చేశారని గుర్తు చేశారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు ఆయన పేరు పెట్టుకుంటే అభ్యంతరం లేదని, కానీ పొట్టి శ్రీరాములు పేరును తొలగించి అవమానించడం కరెక్ట్ కాదన్నారు. 

పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆదివారం బండి సంజయ్​ పూలమాల వేసి నివాళులర్పించారు.  పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును మార్చడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ  బండి సంజయ్​కి ఆర్యవైశ్య సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. సీపీఐ నాయకులు ప్రతిపాదిస్తే సీఎం రేవంత్ రెడ్డి తన కులాభిమానంతోనే పొట్టి శ్రీరాములు పేరును తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరును ప్రతిపాదించారని ఆరోపించారు. పొట్టి శ్రీరాములంటే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి  మాత్రమే కాదని, గొప్ప దేశభక్తుడని కొనియాడారు. మహాత్మాగాంధీకి ఇష్టమైన వ్యక్తి అని తెలిపారు.  ‘‘ఆంధ్రా మూలాలున్నాయని పొట్టి శ్రీరాములు పేరును తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్టీఆర్ పార్క్ కు ఆయన పేరును తొలగించే దమ్ముందా? కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేరిట ఉన్న పార్కులకు వాళ్ల పేర్లను తొలగించే దమ్ముందా? కోట్ల విజయభాస్కర్ పేరిట ఉన్న స్టేడియానికి ఆ పేరును తొలగించే  దమ్ముందా? అంతెందుకు ట్యాంక్ బండ్ పై అనేక మంది ఆంధ్రుల విగ్రహాలున్నాయి. వాటిని తొలగిస్తారా?’’ అని ప్రశ్నించారు. 

15 నెలల్లోనే రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసిన్రు

 రాష్ట్ర సర్కారు15 నెలల్లోనే లక్షన్నర కోట్ల అప్పు చేసిందని,  రాష్ట్రంపై రూ.10 లక్షల కోట్ల అప్పు భారం మోపబోతున్నదని బండి సంజయ్ ​అన్నారు.  ఆదివారం  సిరిసిల్లలో బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన బండి సంజయ్ మాట్లాడుతూ..  6 గ్యారంటీలను నెరవేరిస్తే..  రైతు భరోసా, రుణమాఫీ పైసలన్నీ ఇస్తే.. అవినీతిరహిత పాలన చేస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని,  అవినీతి, అరాచక పాలన చేస్తూ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కితే  ఏ విధంగా ఇమేజ్ పెరుగుతుందని దుయ్యబట్టారు.  రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని,  బీఆర్ఎస్ చేసిన స్కామ్స్​లో   కేసీఆర్ ను అరెస్ట్ చేయకుండా కాంగ్రెస్ కాపాడుతున్నదని ఆరోపించారు.  కేసీఆర్ కు నోటీసులు కూడా ఇచ్చే దమ్ము లేదని అన్నారు. ఆ రెండు పార్టీలు  బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.  వచ్చే ఎన్నికల్లో  బీఆర్ఎస్, కాంగ్రెస్​ పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యం లేదని అన్నారు. బీజేపీ కార్యకర్తల కృషివల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని చెప్పారు. ఈ  కార్యక్రమంలో బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, చెన్నమనేని వికాస్ రావు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.