కొండా సురేఖ అక్కకు.. ఓ తమ్ముడిగా దండ వేశా

కొండా సురేఖ అక్కకు.. ఓ తమ్ముడిగా దండ వేశా
  • తప్పుడు పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్త: రఘునందన్ రావు 
  • హరీశ్​రావు పెయిడ్ ఇనిస్టిట్యూట్ ఇలా చేసిందని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: ఓ అక్కకు.. తమ్ముడిగా మంత్రి కొండా సురేఖకు నూలు పోగు దండ వేశానని, ఆమెపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు ఒక వకీల్​గా ప్రయత్నిస్తానని, కేసులు నమోదు చేయిస్తానని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొండా సురేఖ తమ జిల్లాకు ఇన్‌చార్జి మంత్రి అని పేర్కొన్నారు.

తల్లి, అక్క, చెల్లి మధ్య ఉండే సంబంధం గురించి బీఆర్ఎస్ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెడుతున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్టులు పెట్టిన వారు హరీశ్ రావు పెయిడ్ ఇనిస్టిట్యూట్ వాళ్లు కాకుంటే, ఆయన వెంటనే దీనిపై ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పోస్ట్ పెట్టిన వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్​చేశారు. కామెంట్స్ పెట్టిన వారి ఐడీలకు కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ ఫొటోలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. 

అలాంటిది ఈ ఘటనపై హరీశ్​రావు చింతిస్తున్నానని చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. బీఆర్ఎస్ నేతలు దిగజారిన రాజకీయాలు చేయొద్దని ఆయన హెచ్చరించారు. సిద్ధాంతపరమైన అంశాలపై కొట్లాడకుండా మహిళలపై ఇలాంటి పోస్టులు పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఇటువంటి చర్యలు పాల్పడుతున్న వారిని పోలీసులు 24 గంటల్లో అరెస్ట్ చేయాలని, లేదంటే మరింత చెలరేగిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. వెకిలి చేష్టలు చేస్తే మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు.

బీఆర్ఎస్ నేతలకు మహిళ అంటే కవిత తప్ప ఇంకెవరూ కనిపించరని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో నేతన్నలు ఎక్కువగా ఉంటారని, కేటీఆర్ సిరిసిల్లకు వస్తే ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల మీద  బీఆర్ఎస్ కు గౌరవం లేదని, అందుకే తెలంగాణ తొలి కేబినేట్​లో మహిళలకు చోటు ఇవ్వలేదన్నారు. తన వల్ల అక్క(కొండ సురేఖ)కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ, విచారం వ్యక్తం చేస్తున్నట్టు ఆయన చెప్పారు.