ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే రోజు ఇద్దరు ముఖ్య నేతలు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేర్వేరుగా రెండు జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలకు అటెండ్ కానున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ మీద నిరసన ర్యాలీ కోసం బండి సంజయ్ ఇవాళ సాయంత్రం ఖమ్మం వస్తుండగా, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఒకటే రోజు ఇద్దరు లీడర్లు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలతో పొలిటికల్ హీట్ పెరగనుంది.
ఖమ్మంలో బండి..
నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనేందుకు ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖమ్మం వస్తున్నారు. పేపర్ లీకేజీ కారణంగా నష్టపోయిన బాధిత నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం, సిట్టింగ్ జడ్జితో పేపర్ లీక్ మీద ఎంక్వైరీ, లీక్ పై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలనే డిమాండ్లతో బీజేపీ ఈ నిరుద్యోగ మార్చ్ ను చేపట్టింది. సాయంత్రం 4 గంటలకు ఖమ్మం జడ్పీ సెంటర్ కు సంజయ్ చేరుకుంటారు. అక్కడి నుంచి పాదయాత్ర, ర్యాలీగా మయూరీ సెంటర్ వరకు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. బీజేపీ జాతీయ నేత, తమిళనాడు రాష్ట్ర సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీ, జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, నేతలు కాసం వెంకటేశ్వర్లు, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొంటారు.
కొత్తగూడెంలో పొంగులేటి..
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోడు పోరు పేరుతో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలోనే అత్యధికంగా పోడు భూముల పట్టాల కోసం దరఖాస్తులు వచ్చిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు కొత్తగూడెంలోని ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు 'పోడు రైతు భరోసా' ర్యాలీ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గత నెలలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే డిమాండ్ తో ఖమ్మంలో పొంగులేటి రైతు భరోసా యాత్ర నిర్వహించారు. ట్రాక్టర్ లో కలెక్టరేట్ కు వెళ్లి వినతిపత్రం సమర్పించారు. ఇప్పుడు పోడు పట్టాల కోసం ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.