రాజగోపాల్ రెడ్డితోనే మునుగోడు అభివృద్ధి : బండి సంజయ్

రాజగోపాల్ రెడ్డితోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వెల్లడించారు. మర్రిగూడెంలో ఎన్నిక ప్రచారం నిర్వహించిన ఆయన.. మర్రిగూడెం అభివృద్ధికి ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలని.. ఇందుకు తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు. రాజగోపాల్ రెడ్డి ఒక్క రాజీనామాతో ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. గట్టుప్పల్ మండల ప్రకటన, 100 పడకల ఆసుపత్రి తిరిగి ఇక్కడకు వచ్చిందన్నారు. అలాగే ఆసర పెన్షన్ ల తో పాటు ప్రభుత్వం ఎన్నో కేటాయిస్తోందన్నారు.

ముఖ్యమంత్రిని ఫాంహౌస్ నుంచి బయటకు తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డికి దక్కుతుందన్నారు. 16 మంది మంత్రులు, 88 మంది ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు మునుగోడులో మకాం వేశారన్నారు. ఇంతమంది గతంలో ఇక్కడకు వచ్చారా అని నిలదీశారు. ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారానికి గత ప్రధాని వాజ్ పేయి కృషి చేశారని వెల్లడించారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని కోరారు.