తుఫాన్ కారణంగానే ఖమ్మం సభ వాయిదా.. అమిత్ షా టూర్ రద్దు : బండి సంజయ్ 

జూన్ 15వ తేదీన ఖమ్మంలో జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేశామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. తుఫాన్ కారణంగా గుజరాత్, మహారాష్ట్రలో భారీ ఎత్తున వర్షాలు వస్తుండటంతో బహిరంగ సభను వాయిదా వేశామన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 24 గంటలపాటు పర్యవేక్షించాల్సిన అవసరం ఉన్నందున.. ఖమ్మం బహిరంగ సభకు రాలేకపోతున్నారని.. అందువల్లే సభను వాయిదా వేశామని స్పష్టం చేశారు. 

ఎన్డీఆర్ఎఫ్ దళాలను ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు పంపారని బండి సంజయ్ వెల్లడించారు. ఇప్పటికే చాలా రైళ్లను రద్దు చేశారని, దాదాపు 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని చెప్పారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఖమ్మం సభను వాయిదా వేశామన్నారు. ఈ విపత్కర సమయంలో బహిరంగ సభ నిర్వహించడం సముచితం కాదనే నిర్ణయానికి వచ్చామని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. అతి త్వరలోనే అమిత్ షాతోనే ఖమ్మంలోనే బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ప్రధాని మోడీ బహిరంగ సభను కూడా ఖమ్మంలోనే నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపారు.