కరీంనగర్, వెలుగు: జూన్ 4న వెలువడే కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాక్ ఇవ్వబోతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. తనను ఓడించేందుకు ముస్లింలంతా ఏకం కావాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చారని, హిందువులంతా ఏకమైతే ఏ విధమైన ఫలితాలు వస్తాయో జూన్ 4న తేలుతుందన్నారు. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఎంపీ ఆఫీస్లో కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు.
కొద్దిసేపు అల్లుడు శ్రీనిక్ ను స్కూటీపై కరీంనగర్ రోడ్లపై తిప్పారు. బేకరీకి తీసుకెళ్లి స్నాక్స్ తిన్నారు. సాయంత్రం కార్యకర్తల కోరిక మేరకు టవర్ సర్కిల్ వద్దకు వచ్చారు. అక్కడున్న దుకాణాలకు వెళ్లి వ్యాపారులతో ముచ్చటించారు. అనంతరం రాజు టీ స్టాల్ వద్ద కార్యకర్తలతో కలిసి చాయ్ తాగారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఫలితాలను చూసి తట్టుకునే శక్తి కేసీఆర్ కు ఉండాలని కోరుకుంటున్నా.. ఎందుకైనా మంచిది ఇద్దరు డాక్టర్లను పక్కన పెట్టుకుంటే మంచిది. ఆయన నిండునూరేళ్లు బతకాలని కోరుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కిందని, మోదీపైనా, బీజేపీపైన విషం చిమ్మడం ద్వారా ప్రజలను తీవ్రమైన భయాందోళనలకు గురి చేసిందన్నారు.
ఎన్నికలు ముగిసినందున ఇకనైనా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని కోరారు. రుణమాఫీతో పాటు 6 గ్యారంటీల అమలుకు అవసరమైన నిధులను సేకరించాలని, విధివిధానాలు రూపొందించుకోవాలని సూచించారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తే పూర్తి స్థాయిలో సహకరిస్తామని, లేనిపక్షంలో కాంగ్రెస్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.