అభివృద్ధి జపంతో సంజయ్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్ ఆకర్ష్

 అభివృద్ధి జపంతో  సంజయ్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్ ఆకర్ష్
  • రాజకీయాలు మాట్లాడనంటూనే బండి పాలిటిక్స్‌‌‌‌‌‌‌‌
  •  వ్యూహాత్మకంగా మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇద్దరు కార్పొరేటర్ల చేరికలు 
  •  వచ్చే ఎన్నికల్లో కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ను కైవసం చేసుకునే దిశగా అడుగులు

కరీంనగర్, వెలుగు:కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తాను రాజకీయాలు మాట్లాడబోనని, అభివృద్ధి కోసం అందరితో కలిసిపోతానని చెప్తూనే.. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.  తనకు, గంగులకు గ్యాప్ లేదని ఆయన బహిరంగ సభలో ప్రకటించి 24 గంటలు గడవకముందే.. మేయర్ సునీల్‌‌‌‌‌‌‌‌రావును పార్టీలో చేర్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

అభివృద్ధి పేరుతో దగ్గరైనట్లు ప్రకటించి.. తమ పార్టీ లీడర్లను లాక్కోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. మరోవైపు స్మార్ట్ సిటీ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటా సగం ఉన్నప్పటికీ శుక్రవారం నాటి ప్రారంభోత్సవాలు, సభ బీజేపీ సభను తలపించిందని, ప్రొటోకాల్ కూడా పాటించలేదని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నట్లు తెలిసింది.  

బల్దియాను దక్కించుకునే ప్లాన్‌‌‌‌‌‌‌‌

వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ను కైవసం చేసుకునే దిశగా బండి సంజయ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. శనివారం నిర్వహించిన చేరికల సభలోనూ కార్పొరేషన్ పై కమలం జెండా ఎగురవేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. 2020లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ 13 స్థానాల్లో గెలుపొందగా.. అప్పటితో పోలిస్తే ఐదేళ్లలో పార్టీ సంస్థాగతంగా మరింత పుంజుకుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లోనూ కరీంనగర్ సిటీ పరిధిలో బీఆర్ఎస్ కంటే బీజేపీకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ గెలుపు ఖాయమనే ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో 
వ్యక్తమవుతోంది.  

ఒక్క రోజులో మారిన సీన్

తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదంటూ పొన్నం, గంగులనుద్దేశించి బండి సంజయ్ కామెంట్  చేసిన కరీంనగర్ సభలోనే అనేక గ్యాప్స్ బయటపడ్డాయి. గతంలో బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ను చాలాసార్లు విమర్శించిన సునీల్‌‌‌‌‌‌‌‌రావు.. సభలో స్మార్ట్ సిటీ క్రెడిట్ అంతా సంజయ్‌‌‌‌‌‌‌‌కే ఇచ్చేశారు. సునీల్‌‌‌‌‌‌‌‌రావు తన ప్రసంగంలో ఎక్కడా కేసీఆర్, కేటీఆర్, వినోద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరు ప్రస్తావించకుండా తాను పార్టీతో దూరమైన విషయాన్ని చెప్పకనే చెప్పారు. శుక్రవారం వరకు నవ్వుతూ పలకరించుకున్న గంగుల, సునీల్‌‌‌‌‌‌‌‌రావు మరుసటి రోజే పరుషపదజాలంతో, పదునైన మాటలతో దూషించుకునే స్థితికి చేరడం జిల్లాలో హాట్‌‌‌‌‌‌‌‌ టాపిక్‌‌‌‌‌‌‌‌గా మారింది.