
కరీంనగర్ లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి బండి సంజయ్.. అస్వస్థతకు లోనయ్యారు. రాజీవ్ చౌక్ నుంచి బీజేపీ విజయ్ సంకల్ప్ పాదయాత్ర పేరుతో ఆయన ఎన్నికల ప్రచారంలో ఈ ఉదయం పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రచారం చేస్తుండగా… సడెన్ గా బండి సంజయ్ కళ్లు తిరిగిపడిపోయారు. ఆయన అనుచరులు వెంటనే బండి సంజయ్ ను అంబులెన్స్ లో స్థానిక అపోలో రీచ్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
బండి సంజయ్ కు వడదెబ్బ తాకడం వల్లే ఇబ్బందిపడ్డారని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు డాక్టర్లు. “బండి సంజయ్ కు అపాయం లేదు. ఎండలో స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఇక్కడకు తీసుకొచ్చారు. ఐసీయూలో ఎమర్జెన్సీ వార్డ్ లో ఎమర్జెన్సీ కేర్ ఫిజీషియన్స్ ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు. ఈసీజీ, ఎకో, ల్యాబ్ టెస్టులు, రక్త పరీక్షలు అన్ని చేస్తున్నాం. మా డాక్టర్ల టీమ్ అంతా అక్కడే ఉంది. ఆయనకు ఎటువంటి అపాయం లేదు. కార్యకర్తలు ఆందోళన పడొద్దు. అబ్జర్వేషన్ లోనే ఉన్నారు. తొందరగానే పూర్తి ఆరోగ్యంతో పంపిస్తాం. పొటాషియం లెవెల్స్ తగ్గిపోయి.. డీహైడ్రేషన్ జరిగింది. హార్ట్ సమస్యలు ఏమీ లేవు. ఆరోగ్యంగానే ఉన్నారు” అని డాక్టర్లు చెప్పారు.