హైదరాబాద్: ఓల్డ్ సిటీలో పన్నులు వసూలు చేస్తున్నారా? లేదా అనేదానిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బుధవారం జూమ్ ద్వారా జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన సంజయ్..దీపావళికి బీజేపీని గెలిపించిన దుబ్బాక ప్రజలు సీఎం కేసీఆర్ కు గిఫ్ట్ ఇచ్చారని..GHMC ఎన్నికల్లో బీజేపీని గెలిపించి సంక్రాంతికి మరో గిఫ్ట్ ఇస్తారన్నారు. రైతులకు బోనస్ ప్రకటించాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుందన్నారు. రైతులకు మద్దతు ధరపై కేంద్రం ఆంక్షలు అని సీఎం అబద్ధాలు చెప్తున్నారని.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో దొడ్డు ఒడ్లు పండిస్తూ–ప్రజలు మాత్రం సన్న ఒడ్లు పండించాలని ఆదేశాలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో వెంటనే నిరుద్యోగ భృతిని ప్రకటించాలన్నారు. 2023లో గోల్కొండ కోటలో కాషాయ జెండా ఎగరవేస్తామన్నారు. దుబ్బాక ఫలితాలతో బీజేపీకి మరింత భాద్యత పెరిగిందన్నారు. హైదరాబాద్ లో నాళాలు- చెరువు కబ్జాలు ఎవరు చేశారో ప్రభుత్వం బయటపెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. దుబ్బాక ఎన్నికల కంటే ముందు జీహెచ్ఎంసీలో సర్వే చేస్తే 75 సీట్ల కంటే ఎక్కువ బీజేపీకి వస్తాయని తేలిందన్నారు. వచ్చే ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీదే.