అవ్వ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న బండి సంజయ్  

జగిత్యాల జిల్లా:  పాదయాత్ర వేళ ఓ ముసలవ్వ చూపిన అభిమానాన్ని చూసి తెలంగాణ బీజేపీ చీఫ్​ బండి సంజయ్​ ఉద్వేగానికి లోనయ్యారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాజారం గ్రామంలో పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ ని చూసి.. ‘నా దగ్గరికి రా బిడ్డా’ అని ఓ ముసలవ్వ పిలిచింది. ఆమె బండి సంజయ్ ని చూసి ప్రేమతో హత్తుకొని.. నుదుటిపై ముద్దుపెట్టి ఆశీర్వదించింది.

“బిడ్డా... నువ్వు పాదయాత్ర చేస్తాన్నవ్​.. టైం కు తింటాన్నవా...? లేదా..? టైం కు తిను బిడ్డా...ఇక మేమంటే ముసలోళ్లం... చావుకు దగ్గరగా ఉన్నోళ్ళం.. ప్రజలకు మంచి చేయాలని తిరుగుతున్న నువ్వు చాలా గొప్పోడివి బిడ్డా... నా  ఆయుష్షు కూడా పోసుకుని సల్లగా బతుకు బిడ్డా..”అని బండి సంజయ్ ని ఆ అవ్వ దీవించింది. తనపై అవ్వ చూపించిన ప్రేమకు ఉద్వేగానికి లోనైన బండి సంజయ్​ ఆనందభాష్పాలు రాల్చారు.

 “అవ్వా... నీ దీవెనలతో ప్రజలకు మరింత సేవ చేస్తా.. నీకు మాటిస్తున్న అవ్వా”అని చెప్పి, పాదయాత్రలో బండి సంజయ్​ ముందుకు సాగారు. కాగా, 15వ రోజు (సోమవారం)  18 కిలో మీటర్ల మేర కొనసాగిన బండి సంజయ్ పాదయాత్ర.. మల్యాల మండలం కొండగట్టు శివారులోని నైట్ క్యాంప్ కు చేరుకోవడంతో ముగిసింది.