ఈనెల 11న సంగారెడ్డి పట్టణంలో నిర్వహించే ‘‘నిరుద్యోగ మార్చ్’’ను దిగ్విజయవంతం చేసి సత్తా చాటాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మార్చ్ లో జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ విజయశాంతి పాల్గొంటారని తెలిపారు. నిరుద్యోగ మార్చ్ సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌజ్ నుండి పోతిరెడ్డిపల్లి క్రాస్ రోడ్ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. -ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
బండి సంజయ్ ఏమన్నారంటే
- కేసీఆర్ అనాలోచిత విధానాల వల్ల తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ భృతిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజల బతుకు అథో:గతి పాలవుతున్నా సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించకపోవడం దారుణం.
- తూతూ మంత్రంగా కొంతమందిని అరెస్ట్ చేసి పేపర్ లీకేజీ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. సిట్ దర్యాప్తు నిందితులకు కొమ్ముకాయడానకే పనిచేస్తోందే తప్ప నివేదిక ఇచ్చిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ తోపాటు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం.
- తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. బీజేపీ చేస్తున్న ఉద్యమాలను గమనిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే సత్తా బీజేపీకే ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ ను విజయవంతం చేశారు. ఈ నెల 11వ తేదీన సంగారెడ్డి జిల్లాలో చేపట్టే నిరుద్యోగ మార్చ్ ను సక్సెస్ చేసి ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీకి అడ్డా అని నిరూపించాలి. అందుకోసం నిబద్ధత కలిగిన కార్యకర్తలంతా ఈ నిరుద్యోగ మార్చ్ లో పాల్గొనాలి. పోలింగ్ బూత్ సభ్యులంతా ఒక్కొక్కరు కనీసం వందమందిని తీసుకురావాలి. మీడియా, సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహించాలి.