బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరికాసేపట్లో యాదగిరిగుట్టకు చేరుకోనున్నారు. ఫాంహౌస్ ఎపిసోడ్‌పై నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని ఆయన సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఈ క్రమంలో బండి సంజయ్ మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ నుంచి యాదగిరిగుట్టకు బయలుదేరారు. ఆయన వెంట పలువురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. యాదగిరి గుట్టలో ప్రమాణం చేసి నిజాయితీ నిరూపించుకుంటామని బండి తేల్చి చెప్పారు. సీఎం కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. పోలీసులు అడ్డుకున్నా తాను యాదగిరిగుట్టకు వెళ్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు.
బండి సంజయ్ పర్యటనతో యాదాద్రిలో హై టెన్షన్ నెలకొంది. యాదాద్రికి వస్తున్న సంజయ్ ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నేతలు యాదగిరిగుట్టకు చేరుకున్నారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గొంగడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక టీఆర్ఎస్ నేతలు యాదగిరిగుట్టలో ర్యాలీ తీశారు. అనంతరం బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.