దేశ వ్యాప్తంగా 112 జిల్లాల్లో 500 ( మండలాలు) బ్లాక్ లను కేంద్రం గుర్తించిందన్నారు బండి సంజయ్. నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయికోడ్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం 'సంపూర్ణత అభియాన్' స్కీం ను తీసుకొచ్చిందన్నారు. దీనిలో భాగంగా దేశంలోని 500 బ్లాక్ లలో తెలంగాణలో పది బ్లాకులను( మండలాలను) కేంద్రం గుర్తించిందన్నారు.
ఇందులో నారాయణపేట జిల్లాలోని నర్వ మండలానికి చోటు దక్కగా.. ఈ మండలంలోని పాతర్చెడ్, రాయికోడ్ గ్రామాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, ప్రణాళిక శాఖ, భూగర్భ జల శాఖ డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టిందన్నారు. ఈ మండలాలలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారని చెప్పారు. నీతి ఆయుగ్ ద్వారా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు ఈ మండలాలకు వస్తున్నాయని చెప్పారు.
ALSO READ | పబ్బులు, బార్లతోపాటు ఓయో రూముల్లోనూ తనిఖీ
కేంద్ర సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా ప్రజల సమస్యలను వినడానికి తాము వచ్చామన్నారు బండి సంజయ్. పాఠశాలలకు, హెల్త్ సెంటర్లకు, అంగన్ వాడీ భవనాలకి గ్రామాల్లో ప్రత్యేకమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయన్నారు. ఇవన్నీ సక్రమంగా ప్రజలకు అందుతున్నాయా లేదా దానిపై అధికారులతో సమీక్షిస్తామన్నారు బండి సంజయ్. నీతి ఆయుగ్ ద్వారా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా.. ములుగు జిల్లా, నారాయణపేట, గద్వాల్ ఇలా పలు జిల్లాల్లో పర్యటిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి చెందిన మండలాలతో దీటుగా ఈ మండలాలను అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని బండి సంజయ్ అన్నారు.