జగిత్యాల జిల్లా : ప్రజా సంగ్రామ పాదయాత్రలో భాగంగా చెల్గల్ గ్రామంలోని బీడీ ఫ్యాక్టరీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సందర్శించారు. బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామం నుంచి బండి సంజయ్ ఇవాళ పాదయాత్ర ప్రారంభించారు. ఇవాళ 18 కిలోమీటర్ల మేర నడవనున్నారు. జగిత్యాల టౌన్, ధరూర్, రాజారం, తారక రామ్ నగర్, నూకపల్లె, మల్యాల క్రాస్ రోడ్స్, ముత్యంపేట్ మీదుగా కొండగట్టు వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఇవాళ రాత్రికి కొండగట్టు సమీపంలో బండి సంజయ్ రాత్రి బస చేయనున్నారు.
తమ సమస్యలను చెప్పుకున్న బీడీ కార్మికులు
జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ గ్రామంలో బీజేపీ జెండాను బండి సంజయ్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలోని బీడీ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈ సందర్భంగా తమ సమస్యలను బీడీ కార్మికులు చెప్పారు. జగిత్యాల జిల్లా పరిధిలో 6 లక్షల మంది వరకు బీడీ కార్మికులు ఉన్నారని.. ఈ జిల్లా పరిధిలో 14 బీడీ పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు.
లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నా.. ఈ ప్రాంతంలో కనీసం తమకు 'ఈఎస్ఐ హాస్పిటల్' కూడా లేదని బీడీ కార్మికులు వాపోయారు. వెంటనే ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చేలా చేసి తమను ఆదుకునేలా చూడాలని కోరగా బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. జగిత్యాలలో 'ఈఎస్ఐ హాస్పిటల్' వచ్చేలా కృషి చేస్తానని, బీడీ కార్మికులకు హామీ ఇచ్చారు. బీడీ కార్మికులను కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించిన బండి సంజయ్.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక బీడీ కార్మికులను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.