- ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నిస్తే
- నాపై అవినీతి ఆరోపణలు చేస్తారా?
- సర్కార్ మీదే కదా.. దమ్ముంటే కేసులు పెట్టండి
- కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
వేములవాడ, వెలుగు : రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా వడ్లు ఎందుకు కొనడం లేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్మండలం సంకేపల్లిలోని ధాన్యం కోనుగోలు కేంద్రాన్ని సంజయ్ విజిట్ చేశారు. సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని.. కరీంనగర్లో తనను ఓడగొట్టాలని లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. కాంగ్రెస్ సర్కారు కరీంనగర్లో ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా ధాన్యం కొనలేదన్నారు.
జిల్లాలో 259 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు అంతంత మాత్రమేనన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో బోనస్ ఇస్తామని ప్రకటించి ఎందుకివ్వరని, అదే మేనిఫెస్టోలో తాలు, తరుగు, తేమ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం మార్చిపోయారన్నారు. గ్యారంటీలపై ప్రశ్నిస్తే తనపై అవినీతి అరోపణలు చేస్తున్నారని, తాను అధికారంలోనే లేనని, అవినీతి ఎట్లా చేస్తానన్నారు. ఇప్పుడున్నది కాంగ్రెస్ సర్కారే కాబట్టి దమ్ముంటే తనపై విచారణ జరిపి కేసులు పెట్టుకోవచ్చన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు డా. వికాస్‌రావు ఉన్నారు.
కాంగ్రెస్‌కు అభ్యర్థులు దొర్కుతలేరు
కోరుట్ల : జగిత్యాల జిల్లా కథలాపూర్‌లోని బీజేపీ ఆఫీస్ లోనూ బండి సంజయ్ మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మోదీ గురించి మాట్లాడడం బంద్‌చేసి పదేండ్లు పాలించిన కేసీఆర్ ఫాంహౌస్ ముందు దీక్ష చేయాలన్నారు. కేంద్రం ఇండ్ల కోసం నిధులిస్తే గత ప్రభుత్వం దారి మళ్లించిందని, అప్పుడు ఎందుకు దీక్ష చెయ్యలేదని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఇచ్చిన నిధులను మళ్లించినప్పుడు దీక్ష చేస్తే బాగుండేదన్నారు.
కాంగ్రెస్‌కు ఎంపీ అభ్యర్థులు దొరకట్లేదనీ, ఇప్పటికీ కరీంనగర్ అభ్యర్థిని ప్రకటించకపోవడమే దానికి ఉదాహరణ అని అన్నారు. కథలాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. పైడిపల్లి సత్యనారాయణ, కిసాన్ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ కోడిపల్లి గోపాల్ రెడ్డి , కంటే సత్యనారాయణ ఉన్నారు.