- బ్లాక్ మెయిల్ చేస్తే ఓట్లు పడతాయనుకుంటున్నవా?
- కృష్ణా జలాల వాటా రాకపోవడానికి ముమ్మాటికీ నువ్వే బాధ్యుడివి
- మోదీ, అమిత్ షా గురించి నోరు జారితే ఖబడ్దార్..
- సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ వార్నింగ్
పచ్చి అబద్దాలు, దొంగ మాటలతో మునుగోడు ప్రజలను కేసీఆర్ మాయ చేసే ప్రయత్నం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పదేపదే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారంటూ రైతులను బ్లాక్ మెయిల్ చేసి ఓట్లేయించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతులకు వాస్తవాలు తెలుసని... ఇదే విషయాన్ని దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా ప్రచారం చేసి బొక్కబోర్లా పడ్డారని గుర్తు చేశారు. అయినా బుద్ది మారని కేసీఆర్ బావుల వద్ద ఫ్రీ కరెంట్ ఇస్తూ... ఇండ్ల వద్ద కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో తన వల్లనే భారీగా ధాన్యం దిగుబడి వస్తున్నట్లుగా కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. పంట దిగుబడి ఎక్కవ కావడానికి సీఎం చేసిన ప్రయత్నమేముందన్నారు. దేవుడి దయతో పుష్కలంగా వర్షాలు కురవడంతో పంటలు బాగా పండితే అది తన గొప్పతనమేనని చెప్పుకుంటున్న మూర్ఖుడు కేసీఆర్ అని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం మినహా కొత్తగా ఒక్క ప్రాజెక్టైనా నిర్మించారా అని ప్రశ్నించారు. కేసీఆర్ మూర్ఖత్వం వల్ల వేల కోట్ల రూపాయలు గోదాట్లో పోయ్యాయని ఆరోపించారు.
కుంభ కర్ణుడిలా ఫాంహౌజ్లో పడుకున్నాడు..
కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాపై కేంద్రాన్ని నిందించడం సిగ్గు చేటని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా రాకపోవడానికి ముమ్మాటికీ కేసీఆరే కారణమని ఆరోపించారు. తాను ఎన్నోసార్లు ఆధారాలతోసహా నిరూపించానని... నాటి కేంద్ర జలశక్తి మంత్రి ఉమాభారతి సమయంలో జరిగిన అపెక్స్ సమావేశంలో 299 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించేందుకు అంగీకరిస్తూ సంతకం చేసిన ఆధారాలను పలుమార్లు బయటపెట్టానన్నారు. వాస్తవానికి కృష్ణా జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా... 299 టీఎంసీలకే ఒప్పుకున్న దుర్మార్గుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పేరుతో కృష్ణా నీటిని మళ్లించుకొని పోతుంటే... పట్టించుకోకుండా కుంభకర్ణుడలా ఫాంహౌజ్ లో పడుకున్నడని చురకలంటించారు. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతుందని తాను పదేపదే హెచ్చరించినా పట్టించుకోకుండా ఈ ప్రాంత ప్రజలకు తీరని ద్రోహం చేసిన వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు.
ఉప ఎన్నిక రాగానే రైతులపై ప్రేమ ఒలకపోస్తుండు..
చర్లగూడెం, కృష్ణరాయుని పల్లి ప్రాజెక్టుల్లో భూ నిర్వాసితులు 5 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఊసెత్తని కేసీఆర్.. రైతులకు తానేదో గొప్ప మేలు చేస్తున్నట్లుగా నటించడం సిగ్గుచేటని బండి సంజయ్ అన్నారు. మర్రిగూడ, నాంపల్లి మండలాల రైతులు భూములు కోల్పోయి రోడ్డున పడి రోదిస్తుంటే వాళ్ల గురించి ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. కనీసం వాళ్ల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయని దుర్మార్గుడు కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నిక రాగానే ఇక్కడి రైతుల పైనా ఎక్కడాలేని ప్రేమను ఒలకపోస్తుండటం విస్మయం కలిగిస్తోందన్నారు. మునుగోడుతో సహా రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రజలందరికీ కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా విషయంలో జరిగిన అన్యాయానికి ముమ్మాటికీ కేసీఆరే అనే విషయం తెలంగాణ ప్రజలందరికీ బాగా తెలుసన్నారు.
8 ఏండ్లలో మునుగోడుకు ఏమిచ్చారు...
మునుగోడు ప్రజలను తన గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలతో తిమ్మిన బమ్మిని చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని బండి సంజయ్ అన్నారు. కానీ 8 ఏళ్లలో మునుగోడుకు కేసీఆర్ ఏమిచ్చారని ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నిక రావడంతో ఎట్లా నిధులు వస్తున్నాయి? పనులెట్లా వేగంగా కదులుతున్నాయో ప్రజలు కళ్ళారా చూస్తున్నారన్నారు. ఉప ఎన్నికలొస్తేనే 8 ఏళ్ల నిర్లక్ష్యాన్ని వీడి కేసీఆర్ పరిగెత్తుకుంటూ మునుగోడుకు వచ్చారని చెప్పారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు దిశగా బీజేపీని గెలిపిస్తే కేసీఆర్ అహంకారం పూర్తిగా దిగుతుందని మునుగోడు ఓటర్లకు అర్ధమైందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి బీజేపీని గెలిపించేందుకు మునుగోడు ప్రజలంతా సిద్ధమయ్యారున్నారు.
మేకపోతు గాంభీర్యం..
మునుగోడు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని వింటే... ఆయన గొంతులో వణుకు, మాటల్లో భయం, అసహనం కన్పించాయని బండి సంజయ్ అన్నారు. ఆల్రెడీ టీఆర్ఎస్ పతనం ఖాయమైనట్లుగా ఆయన ప్రసంగంలో స్పష్టంగా కన్పించిందని చెప్పారు. భయంతో చిన్న మెదడు చితికి... చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రిపై అవాకులు చవాకులు పేలారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మాట్లాడే భాషేనా అది ? ఆయన ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ ఛీదరించుకుంటున్నారని తెలిపారు. ఈడీ అంటే ఎంత భయమో ఆయన మాటల్లోనే అర్ధమైందని... అందుకే ఆ సంస్థపై నోటికొచ్చినట్లు తూలనాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.