ఎంఐఎం ఒత్తిడితోనే జగిత్యాల ఎస్సై సస్పెండ్ .?: బండి సంజయ్

జగిత్యాల ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేయడం సభ్యసమాజం తలదించుకునే ఘటన అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు.  ఈ ఘటనపై ఎలాంటి విచారణ చేయకుండానే ఎంఐఎం నేతల ఫోన్ ఆదేశాలతో ఎస్సై అనిల్ పై చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. ఎస్సై అనిల్, ఆయన భార్య చేసిన తప్పేంటని ప్రశ్నించారు.అనిల్ ను సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్టో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  ఎస్సై దాడి చేసిన వీడియోలు ఏమైనా ఉన్నాయా? ఏ ఆధారాలతో ఎస్సైని సస్పెండ్ చేశారో  చెప్పాలన్నారు.  మానవత్వం లేకుండా ఎస్సైని సస్పెండ్  చేయడమే గాకుండా న్యూసెన్స్ కేసు పెట్టారని ధ్వజమెత్తారు. 

పోలీస్ స్టేషన్ పై దాడికి వచ్చిన వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు బండి సంజయ్.  ఓ భర్తగా ఎస్సై తన భార్యను కాపాడుకోవడానికి మాట్లాడితే సస్పెండ్ చేస్తారా అని ప్రశ్నించారు. వెంటనే ఎస్సై అనిల్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.  ఎస్సైని సస్పెండ్ చేస్తే పోలీస్ సంఘాలు ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. ఎలాంటి విచారణ లేకుండానే ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రేపు జగిత్యాల బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.  జగిత్యాల కొంత మంది సంఘవిద్రోహ శక్తులకు అడ్డగా మారిందన్నారు.

వరంగల్ నర్సంపేటలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ గ్రామ పంచాయితీ కార్యలయంలోనే ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు.  అసెంబ్లీ సాక్షిగా సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.  నాలుగేళ్ల ప్రొహిబేషన్ పూర్తిచేసినా వారిని  ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదని ప్రశ్నించారు. 

హనుమాన్ జయంతి సందర్భంగా మే 14న కరీంనగర్లో భారీ ఎత్తున హిందూ ఏక్తాయాత్ర ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులు, కార్యకర్తలు తరలివచ్చి ఐక్యత చాటాలన్నారు.