ఈ ప్రభుత్వానికి బలగం సినిమా చూపించాలె: బండి సంజయ్ భార్య అపర్ణ

అరెస్టులకు బయపడేది లేదన్నారు బండి సంజయ్ భార్య అపర్ణ. పేపర్ లీక్ కేసులో కావాలనే సంజయ్ ని అరెస్టు చేశారని అన్నారామె. బీజేపీ పార్టీ అందరికీ అండగా ఉంటుందని.. ఎవరూ ఆందోళన చెందవద్దని సంజయ్ చెప్పారని అపర్ణ తెలిపారు. కరీంనగర్ జిల్లా జైల్లో తన భర్త బండి సంజయ్ ని కలిసి బయటికి వచ్చిన తర్వాత అపర్ణ మీడియాతో మాట్లాడారు. తనపై పెట్టిన తప్పుడు కేసుల విషయంలో ఆయన ఏమాత్రం భయపడడం లేదని.. కాకపోతే కొద్దిగా ఫిజికల్ గా స్ట్రెయిన్ అయినట్లు కనిపించారని ఆమె తెలిపారు. తెలంగాణలో జరిగే మోడీ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారన్నారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడకూడదని బండి సంజయ్ మాటగా తాను చెబుతున్నానని అపర్ణ వెల్లడించారు. ఎలాంటి ఎమోషన్స్ కూడా లేని ఈ ప్రభుత్వానికి బలగం సినిమా చూపించాలన్నారు

టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయ్యి.. కరీంనగర్ జైలులో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను అతని భార్య అపర్ణ, కుమారుడు, బావ మరిది కలిశారు. ఏప్రిల్ 6వ తేదీ గురువారం ఉదయం ములాఖత్ కింద భార్య అపర్ణ దరఖాస్తు చేసుకోగా.. అనుమతి ఇచ్చారు అధికారులు. ఈ క్రమంలోనే జైలులో ఉన్న భర్తను కలిసి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. 

ములాఖత్ లో భాగంగాలో జైలులో ఉన్న భర్తను కలిసిన భార్య అపర్ణ..ఉద్వేగానికి గురయ్యారు. అర్థరాత్రి ఇంటికొచ్చి బలవంతంగా తీసుకెళ్లిన సమయంలో.. ఆమె అక్కడే ఉన్నారు. 24 గంటల తర్వాత భర్తను జైలులో కలవటంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంపీ బండి సంజయ్ కు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. గతంలో ఆయనకు గుండెకు చికిత్స జరిగింది. ఈ క్రమంలోనే తీసుకుంటున్న ట్యాబ్లెట్లు, ఆహారంపై వాకబు చేశారు భార్య అపర్ణ.