బండి సంజయ్ కాన్వాయ్​పై కోడిగుడ్లతో దాడి

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కాన్వాయ్​పై కోడిగుడ్లతో దాడి జరిగింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ఈ ఘటన చేసుకుంది. దీంతో అక్కడ కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. దుండగులను బీజేపీ నేతలు పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ వారు పారిపోయారు. భీమదేవరపల్లిలో బుధవారం బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర కొనసాగింది. ముందుగా కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో ఆయన పూజలు చేశారు. 

తర్వాత మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహారావు స్వగ్రామం వంగరలో యాత్ర నిర్వహించారు. పీవీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అక్కడి నుంచి ముల్కనూరు వైపు వెళ్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు బండి సంజయ్ కాన్వాయ్​పై కోడిగుడ్లు విసిరారు. అవి కాస్త.. కాన్వాయ్ ముందున్న జర్నలిస్టుల వెహికల్, కెమెరాలపై పడ్డాయి. విషయం తెలుసుకున్న బండి సంజయ్.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

స్టైల్ కోసం వచ్చే సెక్యూరిటీ తనకు వద్దని, వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులపై సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు తమపై కోడి గుడ్లతో దాడి చేస్తుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. కాజీపేట ఏసీపీ తిరుమల్ అక్కడికి చేరుకుని బండి సంజయ్​ను సముదాయించారు. ఆ తర్వాత ఎల్కతుర్తి మండలం మీదుగా కమలాపూర్ వరకు యాత్ర కొనసాగించారు.