
కరీంనగర్: 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఉపాధ్యాయులు బీజేపీ అభ్యర్థిని ఆదరించారన్నారు. బీజేపీ చేస్తోన్న పోరాటాలను గుర్తించి ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ముల్క కొమురయ్య ఘన విజయం సాధించారు.
ఈ సందర్భంగా గెలుపు సంబరాల్లో పాల్గొన్న బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక విజయాన్ని ప్రధాని మోడీకి అంకితం ఇస్తున్నామని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసిపోయి బీజేపీని ఓడించాలని చూశాయని.. కానీ ఉపాధ్యాయులు ఈ రెండు పార్టీల కుట్రలను గుర్తించి బీజేపీని గెలిపించారన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టలేని దుస్థితిలో ఉన్నాయని ఎద్దేవా చేశారు.
కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీకి ఇది మూడో విజయమని గుర్తు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ కిషన్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించిందని పేర్కొన్నారు. తెలంగాణలో రామరాజ్యం, మోడీ రాజ్యం రానుందని చెప్పడానికి ఇదే నిదర్శమని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలోనూ బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తారని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.