మరికొన్ని గంటల్లో గ్రూప్- 1 ఎగ్జామ్: CM రేవంత్‎కు బండి సంజయ్ బహిరంగ లేఖ

మరికొన్ని గంటల్లో గ్రూప్- 1 ఎగ్జామ్: CM రేవంత్‎కు బండి సంజయ్ బహిరంగ లేఖ

హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి నిర్వహిస్తోన్న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షపై హై టెన్షన్ నెలకొంది. గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలని.. జీవో నెం 29 రద్దు చేసి ఎగ్జామ్ రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. మరోవైపు 2024, అక్టోబర్ 21వ తేదీన చెప్పిన డేట్ ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వ సిద్ధమైంది. పరీక్ష నిర్వహణకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కొన్ని గంటల్లో తెలంగాణలో ఫస్ట్ టైమ్ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరగబోతుంది.

అభ్యర్థుల ఆందోళనల నేపథ్యంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో గ్రూప్ 1 ఎగ్జామ్‎పై సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి, బీజేపీ కీలక నేత బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ‘‘పంతానికి పోకుండా జీవో నెం 29ని ఉపసంహరించుకోవాలి. గ్రూప్ 1 అభ్యర్థులు చివరిక్షణం వరకు ఆందోళన చేస్తున్నారు. నిరుద్యోగుల ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుని పరీక్ష వాయిదా వేయాలి. జీవో నెం 29 వల్ల 5003 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు మెయిన్స్‎కు దూరమయ్యారు. మొత్తం పోస్టుల్లో 354 రిజర్వ్ పోస్టులు ఉన్నాయి. 

Also :- విపక్షాల ట్రాప్‎లో పడొద్దు

జీవో నెం 29తో రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది. ఓపెన్ మెరిట్ వారిని రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయం. జీవో నెం 29 వల్ల ఓసీలు 1:65 మేరకు అర్హత సాధించారు. జీవో నెంబ 29తో రాష్ట్రంలో రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారనే భయం మొదలైంది. అభ్యర్థుల ఆవేదనను సీఎం రేవంత్ రెడ్డి పరిగణలోకి తీసుకుని గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రీ షెడ్యూల్ చేయాలి’’ అని బండి సంజయ్ లేఖలో డిమాండ్ చేశారు.

కాగా, గ్రూప్ అభ్యర్థులకు మద్దతుగా శనివారం (అక్టోబర్ 19) హైదరాబాద్ లోని అశోక్ నగర్ కు వెళ్లిన బండి సంజయ్.. అభ్యర్థులతో కలిసి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. వేల మంది అభ్యర్థులతో కలిసి ఛలో సెక్రటేరియట్‎కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బండి సంజయ్‎ను పోలీసులు అదుపులోకి తీసుకుని ధర్నా స్థలం నుండి తరలించారు. తాజాగా మరోసారి గ్రూప్ 1 అభ్యర్థుల కోసం బండి సంజయ్ నోరు విప్పారు.