యాదగిరి గుట్ట నుంచి మూడో విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అన్నారు. మొదటి విడత పాదయాత్రలో భాగ్యలక్ష్మి అమ్మవారు.. రెండో విడత పాదయాత్రలో జోగులాంబ అమ్మవారి శక్తి ఏంటో చూశారన్నారు. ప్రజలను ఇబ్బందులు పెట్టే వాళ్ళను యాదగిరి గుట్ట నర్సింహ స్వామి వారు ఎలా తెరమరుగు చేస్తారో అందరికి తెలుసని..అందుకే మూడో విడత పాదయాత్రను స్వామి వారి ఆశీస్సులతో స్టార్ట్ చేస్తున్నామన్నారు. యాదగిరి గుట్ట నుంచి వరంగల్ భద్రకాళి అమ్మవారు దేవాలయం వరకు మూడో విడత పాదయాత్ర ఉంటుందన్నారు.
రాష్ట్రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల జరిగాయంటే పాద యాత్రే కారణమని బండి సంజయ్ అన్నారు. నిజాయితీ గల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణా ప్రజల్లో మార్పు వస్తుందని.. ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. ఈ మార్పు కు ప్రజాసంగ్రామ యాత్రనే కారణమన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు పాదయాత్రపై విమర్శలు చేశాయన్నారు. పాదయాత్ర ప్రజలకు ఒక భరోసా అని బండి సంజయ్ అన్నారు.