వరంగల్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది కథను సృష్టించి అమృత్ టెండర్లలో అక్రమాలంటూ నాటకాలు ఆడుతున్నాడని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర పథకమైన అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తప్పుడు ఆరోపణలు చేయడాన్ని ఖండించారు.
రేవంత్‌రెడ్డి సీఎం కాకముందే సృజన్ రెడ్డి, కేటీఆర్ మధ్య వ్యాపార సంబంధాలున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరినందుకు నజరానాగా పాలమూరు–రంగారెడ్డి పనుల కాంట్రాక్ట్ ఇస్తే.. అవి సృజన్ రెడ్డి చేసింది వాస్తవం కాదా అని అడిగారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కాలంలో హెచ్ఎండీఏ పరిధిలో ఇచ్చిన అనుమతుల్లో జరిగిన అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు.