మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు: శ్రేయా చౌదరి

మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు: శ్రేయా చౌదరి

నటీనటులు ఎవరైనా వాళ్ల దగ్గరకొచ్చే కథల్ని విని, వాటిలో నచ్చిన వాటిని ఎంచుకుంటారు. కొన్నిసార్లు మాత్రం కొన్ని కథలు వెతుక్కుంటూ యాక్టర్​ దగ్గరకి వెళ్లినట్టే అనిపిస్తుంది. అందుకు కారణం.. ఆ పాత్రలో లీనమై వాళ్లు చేసే పర్ఫార్మెన్స్​ అలా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అమెజాన్​ ప్రైమ్​ వీడియోలో స్ట్రీమ్ అవుతోన్న ‘బాండిష్ బాండిట్స్​’ సిరీస్​లో ‘తమన్నా’ పాత్ర కూడా అంతే! తమన్నా పాత్రలో శ్రేయా ఛౌదరీ నటించింది. ఈ సిరీస్​ రెండు సీజన్​లలోనూ ఆమె చేసిన పర్ఫార్మెన్స్​కి ఆడియెన్స్ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమె నేపథ్యం, సినిమా జర్నీ, సిరీస్​ల గురించిన సంగతులివి. 

బాలీవుడ్​ నటి శ్రేయా ఛౌదరీ.. అమ్మానాన్నలు కాంచన, రోహిత్ ఛౌదరీ. కలకత్తాలో పుట్టిన ఆమె ముంబైలో చదువుకుంది. మాస్​ కమ్యూనికేషన్​లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కాలేజీలో ఉన్నప్పుడు ఒక టీవీ కమర్షియల్ యాడ్ కోసం ఆడిషన్​ జరిగింది. అందులో తను పార్టిసిపేట్​ చేసింది. గ్రాడ్యుయేషన్ అయిపోయాక, అనుకోకుండా మోడలింగ్​లో అడుగుపెట్టింది. దాని ద్వారా టీవీలో కమర్షియల్ యాడ్స్ చేసే అవకాశాలు వచ్చాయి. అవి చేస్తుండగానే సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేసింది. నిజానికి చిన్నప్పటి నుంచే యాక్టివిటీస్​లో ఇంట్రెస్ట్​గా పాల్గొనేది. 2014లో ఫెమినా మిస్ ఇండియా కోల్​కత్తా బ్యూటీ కాంటెస్ట్​లో పాల్గొన్నది. అలాగే ఎఫ్​బీబీ ఫెమినా మిస్ ఫ్యాషన్​ ఐకాన్​, ఫెమినా మిస్ బాడీ బ్యూటీఫుల్​, టైమ్స్ మిస్​ సుడోకు వంటి టైటిల్స్ గెలిచింది. గుర్తింపు పొందిన మ్యాగజైన్​లలో కవర్​ పేజీకి ఎక్కింది. తన ఇండస్ట్రీ జర్నీ ఎలా ఉందో ఆమె మాటల్లో తెలుసుకుందాం. 

నా పట్టుదల చూసి.. 

నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేసేది. నా మైనస్ పాయింట్స్ గురించి చర్చించడానికి వాళ్లు ఏమాత్రం వెనుకాడరు. నాకు సినిమాల మీద ఇష్టం పెరుగుతున్నరోజుల్లో నాన్న శుక్రవారం, శనివారం మూవీ నైట్స్ ఏర్పాటు చేసేవాళ్లు. సౌత్​ సినిమాలతోపాటు ఇరానీ, కొరియా, యూరోపియన్, హాలీవుడ్ సినిమాలు చూడడానికి ఇష్టపడేవాళ్లం. దాంతో చిన్న వయసులోనే రకరకాల సినిమాలు నాకు పరిచయం అయ్యాయి. కాలేజీలో ఉండగానే కమర్షియల్ యాడ్ చేసే అవకాశం కూడా వచ్చింది. ఆ తర్వాత నేను ఈ ఫీల్డ్​లో కంటిన్యూ అవుతానంటే వాళ్లు మొదట ఆశ్చర్యపోయారు. నా పట్టుదల చూసి వాళ్లు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. నిజంగా అది నా జీవితాన్ని మలుపుతిప్పింది అని చెప్పొచ్చు. ఎందుకంటే మ్యాథ్స్ బాగా చేస్తానని నన్ను ఇంజనీర్ అవ్వమని లేదా డెస్క్ జాబ్​ చేయమని ఒత్తిడి చేయకుండా, నాకు నచ్చిన దాంట్లో ముందుకు వెళ్లమని ప్రోత్సహించారు.

ఇంటర్నేషనల్​గా గుర్తింపు

2018లో వచ్చిన ‘మెహతా బాయ్స్’ నాకు చాలా స్పెషల్ ఫిల్మ్. బొమన్ ఇరానీ డైరెక్షన్​లో నటించడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే నా కెరీర్​ ప్రారంభంలోనే ఆస్కార్ విజేత, రచయిత అలెగ్జాండర్ డినెలారిస్​తో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ​ప్రస్తుతం అది చికాగో సౌత్ ఏసియన్​ ఫిల్మ్ ఫెస్టివల్​ 2024లో ఈ సినిమా ప్రీమియర్​ కావడం చాలా సంతోషంగా ఉంది అని శ్రేయా చెప్పింది.

‘డియర్​ మాయా’తో మొదలు..

కాస్టింగ్ డైరెక్టర్స్​ ద్వారా ‘డియర్ మాయా’ అనే సినిమాతో 2017లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాతి ఏడాది ‘ఫిల్మ్ మేకర్ ఇంతియాజ్ అలీ సినిమాలో ‘ది అదర్ వే’లో నటించింది. అందులో నటించడం వల్లే తనలో కాన్ఫిడెన్స్ పెరిగింది. అదే  ‘బాండిష్ బాండిట్స్’​ సిరీస్​లో లీడ్​ రోల్​లో పర్ఫార్మ్ చేసేందుకు తోడ్పడింది.  

బాండిష్​ బాండిట్స్ గురించి..

బాండిష్​ బాండిట్స్ సీజన్​1లో అవకాశం వస్తుందని నేను ఊహించలేదు. నిజానికి స్క్రిప్ట్​ నన్ను ఎంచుకుంది అనుకుంటా. డైరెక్టర్​, మిగతా నటీనటుల గురించి తెలియగానే వెంటనే ఒప్పుకున్నా. స్క్రిప్ట్​ చదివేటప్పుడు ఇంకా బాగా అనిపించింది. ఇందులో నా పాత్ర పేరు తమన్నా. ఆ రోల్​కి, నా రియల్ క్యారెక్టర్​కి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకే నాకు చాలా ఎగ్జైటింగ్​గా అనిపించింది. అంతేకాకుండా ఇది మ్యూజిక్​ చుట్టూ తిరిగే స్టోరీ. ఆ ఆలోచన నాకు చాలా ఫ్రెష్​గా అనిపించింది. అలా ఆ సిరీస్​లో నటించా. నా పాత్రకు వచ్చిన రెస్పాన్స్ ఇప్పటికీ మర్చిపోలేను. కట్​ చేస్తే.. సీజన్​ 2 కోసం మేం చాలా వర్క్​షాపులు చేశాం. ట్రైనింగ్ సెషన్స్​కి అటెండ్ అయ్యాం. 2022 చివరి నాటికి షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ ప్రాజెక్ట్​కి సైన్ చేసిన తర్వాత ఇందులో ఎవరెవరు నటిస్తున్నారని అడిగినప్పుడు వాళ్లు చెప్పిన పేర్లు విని నేను ఆశ్చర్యపోయాను. ఇప్పటివరకు వాళ్లను స్ర్కీన్​లో చూడడం, వాళ్ల పర్ఫార్మెన్స్​కి ఫిదా అయ్యి ఇన్​స్పైరింగ్​గా తీసుకోవడం మాత్రమే జరిగాయి. కానీ, ఇప్పుడు వాళ్లతో ఈ సిరీస్​లో నటించడం ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను. వాళ్లు చేసే హార్డ్​ వర్క్ చూస్తే మనకు అసలు నెర్వస్​నెస్ అనేది ఉండదు. ఆ సిన్సియారిటీ, డెడికేషన్​కి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నిజానికి వాళ్ల ఎనర్జీ చూస్తుంటే మనకు కూడా ఆ ఎగ్జైట్​మెంట్ వస్తుంది. వాళ్లకు తెలియకుండానే నా పర్ఫార్మెన్స్​కి ఎంతో హెల్ప్​ చేశారు. ఇప్పుడు ఈ సిరీస్​కి వస్తోన్న ఆడియెన్స్ రెస్పాన్స్ చూస్తే చాలా ఆనందంగా ఉంది. వాళ్లు చూపించే అభిమానం చూస్తుంటే ఇదంతా కలలా అనిపిస్తుంది.