డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వటానికి రెడీ అయ్యారు సినీ నిర్మాత బండ్ల గణేష్. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో.. మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయటానికి దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున.. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయటానికి.. అవకాశం కల్పించాలంటూ ఫిబ్రవరి 2వ తేదీన తన దరఖాస్తును కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గాంధీభవన్ లో సమర్పించారు.
రెండు నెలల రేవంత్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందని.. రాబోయే ఎంపీ సీట్లు అన్నీ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు బండ్ల గణేష్. మతి భ్రమించిన మల్లారెడ్డి పిచ్చి పిచ్చి ఆరోపణల చేస్తున్నారని.. ఫీజుల రూపంలో విద్యార్థుల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాడంటూ తీవ్రంగా మండిపడ్డారాయన. రేవంత్ రెడ్డి పాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా గర్వపడుతున్నానన్న బండ్ల గణేష్.. మల్కాజిగిరి నుంచి పోటీ చేయటానికి పార్టీ అవకాశం ఇస్తే.. కచ్చితంగా గెలుస్తాననే నమ్మకం ఉందన్నారు.
మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తానన్నా.. తీసుకునే వారు లేరని.. ఆయన కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వదని స్పష్టం చేశారు.