చికెన్ క‌ర్రీ ఆర్డ‌ర్ చేస్తే.. ఎలుక మాంసం పెట్టిన రెస్టారెంట్

చికెన్ క‌ర్రీ ఆర్డ‌ర్ చేస్తే.. ఎలుక మాంసం పెట్టిన రెస్టారెంట్

ఓ రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్ చికెన్ ఆర్డర్ చేస్తే  ఎలుక మాంసం పంపించారు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది.  బాంద్రాలోని ఓ ఫేమస్ రెస్టారెంట్‌లో ఆర్డర్  చేసిన  చికెన్ ,  మటన్ డిష్‌లో కస్టమర్ కు ఎలుక మాంసం కనిపించింది. దీంతో 2023  ఆగస్టు 14వ తేదీన బాంద్రా పోలీస్ స్టేషన్‌లో రెస్టారెంట్ పై కేసు నమోదు చేశాడు ఆ కస్టమర్.
 
 గోరేగావ్‌కు చెందిన బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ అనురాగ్ సింగ్ బాంద్రాలో షాపింగ్ చేసిన తర్వాత ఆదివారం రెస్టారెంట్‌కి డిన్నర్‌కి వెళ్లినట్లు పోలీసులకు తెలిపాడు. తాను ఆర్డర్ చేసిన చికెన్ డిష్‌లో ఎలుక పిల్ల కనిపించిందని సింగ్ చెప్పాడు.  ముందుగా తాను దానిని  చికెన్ ముక్కగా భావించి దానిలో కొంత భాగాన్ని తిన్నానని తెలిపాడు.  జాగ్రత్తగా పరిశీలిస్తే, అది పిల్ల ఎలుకని తెలిసిందన్నాడు. 

ముందుగా దీని గురించి తాను రెస్టారెంట్  సిబ్బందికి ఫిర్యాదు చేయగా వారు క్షమాపణలు చెప్పారని తెలిపాడు, కానీ మేనేజర్ సంఘటన 45 నిమిషాలు కూడా ముందుకు రాలేదని తెలిపాడు.  కూరలో ఎలుక ఉన్నట్లు గుర్తించిన వెంటనే తనకు అనారోగ్యంగా అనిపించిందని, అందులో కొన్నింటిని తాను ఇప్పటికే తిన్నానని సింగ్ తెలిపాడు.  ఇంటికి తిరిగి వస్తుండగా ఒక వైద్యుడిని సంప్రదించి, కొన్ని మందులు వాడానని చెప్పుకొచ్చాడు.  

పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని హోటల్ మేనేజర్ వివియన్ సిక్వేరా, ఇద్దరు కుక్‌లను అరెస్టు చేసినట్లు బాంద్రా పోలీసులు వెల్లడించారు. రెస్టారెంట్‌కు చెందిన ఫుడ్ పై విచారణ జరుపుతున్నామని తెలిపారు.