అల్లు అర్జున్ ఏం ఘనకార్యం చేశారు..? బండ్రు శోభారాణి

అల్లు అర్జున్ ఏం ఘనకార్యం చేశారు..? బండ్రు శోభారాణి

హైదరాబాద్: హీరో అల్లు అర్జున్ ఏం ఘనకార్యం చేశారని అంత మంది వెళ్లి ఆయనను పరామర్శించారని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ సహకార అభివృద్ధి చైర్మన్ బండ్రు శోభారాణి విమర్శించారు. అల్జు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‎ను బండ్రు శోభారాణి, రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద ఆదివారం (డిసెంబర్ 15) పరామర్శించారు. 

ఈ సందర్భంగా శోభారాణి మీడియాతో మాట్లాడుతూ.. మేము ఈలలు వేసి.. చప్పట్లు కోడితేనే మీరు హీరోలు, సెలబ్రెటీ అయ్యారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. అల్లు అర్జున్‎ను పరామర్శిస్తున్న వారు.. అదే ఆయన సినిమా విడుదల సందర్భంగా తొక్కిసలాటలో గాయపడి ప్రాణపాయంలో ఉన్న  బాలుడిని ఎందుకు పరామర్శించి మద్దతుగా నిలవట్లేదని ప్రశ్నించారు. మీకు ఒక న్యాయం.. వీళ్లకు మరో న్యాయమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ తేజ కుటుంబానికి తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. 

ALSO READ | స్పిరిట్ లో ప్రభాస్ కి జంటగా సీతారామం హీరోయిన్..?

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీ తేజ్ ను పరామర్శించామని తెలిపారు. శ్రీ తేజ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చామన్నారు. బాధిత కుటుంబం సహాయం కోరితే ప్రభుత్వం తరుఫున తప్పకుండా ఆదుకుంటామని అన్నారు. తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం చట్టప్రకారమే చర్యలు తీసుకుందని.. అందులో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవని ఆమె స్పష్టం చేశారు. 

కాగా, పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధంగా పోలీసులు బన్నీని చంచల్ గూడ జైలుకు తరలించారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ జైలు నుండి విడుదల అయ్యారు. ఈ క్రమంలో జైలుకు వెళ్లి వచ్చిన అల్లు అర్జున్ ఇంటికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వెళ్లి బన్నీకి సంఘీభావం తెలుపుతున్నారు.