
సలార్ మూవీ ఫేమ్ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన "ఎల్2: ఎంపురాన్" మార్చ్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుండటంతో అప్పుడే థియేటర్స్ వద్ద ఎంపురాన్ సందడి మొదలైంది. అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా బెంగళూరుకి చెందిన షెపర్డ్ కళాశాల స్టూడెంట్స్ కి మార్చ్ 27న సెలవు ప్రకటించింది.
అంతేకాదు షెపర్డ్ కాలేజీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక స్క్రీనింగ్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో రాజరాజేశ్వరి నగర్‌లో ఉన్నటువంటి వైజిఆర్ మాల్‌లోని మూవీటైమ్ సినిమాస్‌లో మార్నింగ్ 7 గంటలకు షోను బుక్ చేసుకున్న యాజమాన్యం, విద్యార్థులకు ఉచిత టిక్కెట్లను అందిస్తోంది. ఇక సెలవుని ప్రకటించే క్రమంలో "లైట్లు, కెమెరా, సెలవు!" అంటూ సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ ని షేర్ చేసింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా ఈ పోస్ట్ పై స్పందిస్తూ ఇదెక్కడి మాస్ రా మావా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు..
అయితే ఇలా సినిమా రిలీజ్ రోజున సెలవులు ప్రకటించడం కొత్తేమీ కాదు.. గతంలో తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన "జైలర్" సినిమా రిలీజ్ టైమ్ లో చెన్నై, బెంగళూరులోని కొన్ని కంపెనీలు సినిమా చూడటానికి తమ ఉద్యోగులకు ఒక రోజు సెలవు ఇచ్చాయి. అంతేకాదు కొందరు తమ ఉద్యోగులకి కాంప్లిమెంటరీ టిక్కెట్లు కూడా ఇచ్చారు.
ఇక "ఎల్2 ఎంపురాన్" సినిమా విషయానికొస్తే గతంలో మోహన్ లాల్ నటించిన లూసీఫర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించాడు నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమాలో మోహన్ లాల్ మాఫియా డాన్ పాత్రలో కనిపించాడు.. నటి మంజు వారియర్, టోవినో థామస్ తదితర స్టార్లతోపాటూ పృథ్వీరాజ్ కూడా గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటించాడు.