బెంగళూరు: ఉబెర్, ర్యాపిడో బైక్ డ్రైవర్లను ఎప్పుడైనా ఎంత సంపాదిస్తారని అడిగి చూశారా? ఒకవేళ అడిగి ఉంటే ఎంత చెప్పుంటారు.. మహా అయితే నెలకు 10 వేలు, 15 వేలు.. లేదంటే 30 వేలు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి సంపాదన గురించి తెలిస్తే మీరు షాక్కి గురికాక తప్పదు. ఎంత అంటారా.. అయితే చదవండి.
ఇటీవలి కాలంలో ఉబెర్, ర్యాపిడో, ఓలా తదితర బైక్ సర్వీస్లు మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రజలకు సర్వీస్ ఇవ్వడమే కాకుండా చాలా మందికి అవి ఉపాధి మార్గాలుగా మారిపోయాయి. అందుకే చాలా మంది ఉద్యోగాలు మానేసి బైక్ డ్రైవర్లుగా మారిపోతున్నారు. ఓపిక ఉన్నంత వరకు పని చేసుకోవడం, అలసట అనిపిస్తే ఆపేయడం.. వారి వారి మనోభీష్టానికి అనుకూలంగా పనిచేయడంలో ఈ ట్యాక్సీ సేవలు ఉపయోగపడుతున్నాయి.
అయితే అదే కోవలోకి చెందిన ఓ బైక్ డ్రైవర్ సంపాదన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బెంగళూరుకు చెందిన ఓ డ్రైవర్ను ఎంత సంపాదిస్తారని ఓ కస్టమర్ అడగగా అతను చెప్పిన సమాధానం విని ఆ వ్యక్తి షాక్ గురయ్యాడట. అతను చెప్పిన సంపాదన ఎంతో తెలుసా? నెలకు రూ. 80 వేలు.. అక్షరాల నెలకు ఎనభై వేల రూపాయలు.
అతని ఆన్సర్ విన్న ఆ సదరు వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోకు చాలా తక్కువ సమయంలో 3వేల లైకులు, 6లక్షల వ్యూస్ వచ్చాయట. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ట్యాక్సీవాలా గురించే చర్చ. ఆ డ్రైవర్ను అభినందిస్తూ చాలా మంది కామెంట్లు కూడా పెట్టేస్తున్నారు. కష్టపడి పనిచేస్తే ఆర్థిక స్థిరత్వం సాధించగలం అని నిరూపించారని మెచ్చుకుంటున్నారు.
ALSO READ | క్వాట్ టెక్నాలజీస్ 36వీ ఎల్‌ఈడీ మాడ్యుల్ లాంచ్..
అంతేకదా మరి.. కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా అంత జీతం రావటం లేదు. అలాంటిది బైక్ డ్రైవర్గా ఉంటూ అంతమొత్తంలో సంపాదించడం గొప్ప విషయమే కదా. ఏముందిలే డ్రైవింగ్ చేయడమే కదా అనుకోకండి.. రాత్రి, పగలు తేడా లేకుండా బెంగళూరు లాంటి నగరంలో 13 గంటల పాటు డ్రైవ్ చేయడమంటే మామూలు విషయం కాదు. అందుకే మరి.. ఈ ఉబెర్, ర్యాపిడో డ్రైవర్ అంత వైరల్ అయ్యాడు.