ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీ నగరం బెంగళూరు

ప్రపంచంలోనే రెండో అత్యంత రద్దీ నగరం బెంగళూరు

బెంగళూరు: ట్రాఫిక్​ పేరు చెబితేనే బెంగళూరువాసులు హడలిపోతున్నారు. గంటలకు గంటలు ట్రాఫిక్​ లోనే వారి టైం గడిచిపోతోంది. బెంగళూరులో పది కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే సగటున 29 నిమిషాల 10 సెకన్లు పడుతోందట. దీంతో ప్రపంచంలోనే అతి ఎక్కువ రద్దీ కలిగిన నగరాల జాబితాలో బెంగళూరు రోండో స్థానంలో నిలిచింది. 2022లో సిటీ సెంటర్ (బీబీఎంపీ ఏరియా) కేటగిరీలో ఈ ప్లేస్​ దక్కించుకుంది. తొలి స్థానంలో లండన్ ఉంది. అక్కడ పది కిలోమీటర్ల ప్రయాణానికి సగటున 36 నిమిషాల 20 సెకన్ల టైం పడుతోంది. దీంతో వాహనదారులకు నరకం కనిపిస్తోంది. డచ్​కు చెందిన లొకేషన్‌‌‌‌ టెక్నాలజీ స్పెషలిస్ట్​ టామ్‌‌‌‌టామ్‌‌‌‌.. ట్రాఫిక్‌‌‌‌ ఇండెక్స్‌‌‌‌ 2022 పేరుతో ఓ స్టడీ చేసింది. వాహనాల రద్దీ వల్ల టైం వృథా, ఖర్చుతోపాటు కర్బన ఉద్గారాల ప్రభావాన్ని పరిశీలించింది. ప్రపంచవ్యాప్తంగా 56 దేశాల్లోని 289 నగరాల్లో ఈ స్టడీ చేపట్టింది. 

లిస్ట్​లో పుణె, ఢిల్లీ, ముంబై కూడా..

2022లో సెంట్రల్​ బిజినెస్ డిస్ట్రిక్ట్స్(సీబీడీ) ఏరియాల్లో బెంగళూరువాసులు పది కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 29 నిమిషాల 10 సెకన్ల సమయం పట్టిందని వెల్లడించింది. ఇదే సమయంలో సిటీ సెంటర్​లో రష్​ అవర్​లో యావరేజ్​ స్పీడ్​ గంటకు 18 కిలోమీటర్లుగా ఉంది. 2021లో ఇది గంటకు 14 కిలోమీటర్లు. 2021లో బెంగళూరు రద్దీ నగరాల జాబితాలో 10వ స్థానంలోనూ.. 2020లో ఆరో ప్లేస్​లోనూ ఉండగా ఇప్పుడు రెండో స్థానానికి చేరుకుంది. సిటీ సెంటర్​ కేటగిరీలో ఐర్లాండ్​లోని డబ్లిన్​ మూడో ప్లేస్ లో ఉండగా.. జపాన్​లోని సప్పోరో 4, ఇటలీలోని మిలాన్ 5, మనదేశంలోని పుణె 6వ స్థానంలో నిలిచాయి. మనదేశానికి సంబంధించి అత్యంత రద్దీ నగరాల్లో ఢిల్లీ 34, ముంబై 47వ ప్లేస్​లో ఉన్నాయి. 

మెట్రో ఏరియా కేటగిరీలో ఐదో ప్లేస్

మెట్రో ఏరియా కేటగిరీలో బోగోతా మోస్ట్​ కంజెస్టెడ్​ సిటీగా ఉంది. దాని తర్వాతి స్థానాల్లో మనిలా, సప్పోరో, లిమా, బెంగళూరు(5వ ప్లేస్), ముంబై(6వ ప్లేస్), నగోయా, పుణె, టోక్యో, బుకారెస్ట్ ఉన్నాయి. మెట్రోపాలిటర్​ ఏరియాల్లో బెంగళూరువాసులు పది కిలోమీటర్లు ప్రయాణించేందుకు 23 నిమిషాల 40 సెకన్ల సమయం పట్టింది. యావరేజ్​ స్పీడ్​ గంటకు 22 కిలోమీటర్లు. 

అక్టోబర్​ 15.. వరస్ట్​ డే

2022లో బెంగళూరులో ప్రయాణానికి వరస్ట్​ డేగా అక్టోబర్​ 15 నిలిచింది. ఆ రోజు సిటీ సెంటర్​లో పది కిలోమీటర్ల ప్రయాణానికి 33 నిమిషాల 50 సెకన్ల సమయం పట్టింది. వరస్ట్​ రష్​ అవర్​ శుక్రవారం సాయంత్రం 6 నుంచి 7 మధ్య వరస్ట్​ రష్ అవర్​ ఉంటోందని, ఆ సమయంలో పది కిలోమీటర్ల ప్రయాణానికి 37 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతోందని ఈ రిపోర్ట్ వెల్లడించింది. ఏటా 1009 కేజీలో కార్బన్​ ఎమిషన్లు రిలీజ్​ అవుతుండగా.. ఇందులో ట్రాఫిక్ రద్దీ కారణంగా వెలువడుతున్నవే 275 కేజీలని ఈ రిపోర్ట్​ పేర్కొంది.


ప్రపంచంలోనే రద్దీగా ఉన్న సిటీలు

ప్లేస్    సిటీ    10 కి.మీ.లకు సగటు టైం    రష్​ అవర్​ స్పీడ్

1    లండన్    36:20 ని.    14*
2    బెంగళూరు    29:10 ని.    18
3    డబ్లిన్    28:30 ని.    17
4     సప్పోరా    27:40 ని.     19
5    మిలాన్    27:30 ని.    18
6     పుణె    27:20 ని.    19
34     ఢిల్లీ    22:10 ని.    24
47    ముంబై    21:10 ని.    24
(*గంటకు కిలోమీటర్లలో... సీబీడీ ఏరియాల్లో రద్దీ)