బెంగళూరులో ఓ డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్ హత్య మిస్టరీగా మారింది. స్నేహితురాలు పక్కన ఉండగానే తెల్లవారి లేచి చూసే సరికి బాధితురాలు రక్తపు మడుగులో పడి ఉంది. బెంగుళూరు నగర వాసులను సైతం భయపెడుతోన్న ఈ ఘటన ఈ నెల 27- 28వ తేదీల అర్ధరాత్రి సమయంలో జరిగింది.
ఈ క్రైమ్ సీన్ కథ ఏంటంటే..?
మృతురాలు నవ్యశ్రీ(28) తన భర్త కిరణ్‌తో కలిసి కెంగేరి ఉపనగర ఎస్‌ఎంవీ లేఅవుట్‌లో నివసిస్తోంది. ఈ జంటకు పెళ్లయి మూడేళ్లు అవుతోంది. వీరిది ప్రేమ వివాహం. ఇరువురి కుటుంబసభ్యులకు ఇష్టం లేనప్పటికీ పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. నవ్యశ్రీ డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్ కాగా.. ఆమె భర్త క్యాబ్ డ్రైవర్. ఆదాయం అంతంత మాత్రం కావడంతో పెళ్లైన నాటి నుండి ఆర్థిక లావాదేవీల విషయమై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు.
ధైర్యం చెప్పిన స్నేహితులు
నవ్యశ్రీ హత్య జరిగిన ముందురోజు అనగా మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో పశ్చిమ బెంగళూరులోని విశ్వేశ్వరయ్య లేఅవుట్‌లో ఉంటున్న తన స్నేహితురాలు ఐశ్వర్య ఇంటికెళ్లింది. అక్కడ ఇద్దరి మధ్య చాలా సంభాషణ నడించింది. నవ్య శ్రీ.. భర్తతో గొడవలు, తాను అనుభవిస్తున్న మానసిక క్షోభ గురించి స్నేహితురాలికి అన్నీ చెప్పింది. తన భద్రతపై కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. అనంతరం నవ్య శ్రీ మరో స్నేహితుడు అనిల్‌కు ఫోన్ చేసి కలవాలని కోరింది. ముగ్గురూ బయట కలుసుకున్నారు. ఇదే విషయమై ముగ్గురూ చర్చించాక.. సమస్య పరిష్కారం అవ్వాలంటే భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయమని అనిల్ నవ్యశ్రీకి సలహా ఇచ్చాడు.
ALSO READ | ప్రజలారా జాగ్రత్త..! వైద్యుడి నుంచి రూ. 48 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
అనంతరం అనిల్‌ని దింపిన తర్వాత నవ్యశ్రీ, ఆమె స్నేహితురాలు రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తిరిగి కెంగేరిలోని మృతురాలు ఇంటికి వచ్చి పడుకున్నారు. ఆ రాత్రే ఇద్దరూ బీరు తాగి ఘాడ నిద్రలోకి జారుకున్నారు. అనంతరం తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఐశ్వర్య నిద్రలేచి చూసేసరికి పక్కనున్న స్నేహితురాలు రక్తపు మడుగులో పడి ఉంది.
భర్త అరెస్ట్
ఈ ఘటనలో మృతురాలు భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవ్యశ్రీ భర్త కిరణ్ తెల్లవారుజామున సమయంలో స్పేర్ కీ సహాయంతో ఇంట్లోకి ప్రవేశించి ఇద్దరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి గొంతుపై పదుల సంఖ్యలో గాట్లు ఉండటంతో.. నవ్యశ్రీని చిత్రహింసలకు గురిచేసి చంపినట్టు సంకేతాలు ఉన్నాయని తెలిపారు. నవ్యశ్రీ తన వృత్తిని మార్చుకోవాలని కిరణ్ కోరుకున్నాడని, అయితే ఆమె నిరాకరించిందని ఓ పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు.