గ్రెటా థన్‌బర్గ్ ‘టూల్ కిట్’కు సాయం.. బెంగళూరు స్టూడెంట్‌ అరెస్ట్‌

టూల్ కిట్‌ ను ఎడిట్ చేసిన దిశ 
5 రోజుల పోలీస్ కస్టడీకి ఢిల్లీ కోర్టు ఆదేశాలు
ఢిల్లీ నిరసనల వెనక ప్రొఖలిస్తానీసంస్థ ‘పీజేఎఫ్’ కుట్ర?
దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కొనసాగుతున్న రైతుల నిరసనలకు మద్దతు ఇస్తూ స్వీడిష్ క్లైమెట్ యాక్టివిస్ట్ గ్రెటా థన్​బర్గ్ టూల్ కిట్(గూగుల్ డాక్యుమెంట్)ను షేర్ చేసిన కేసులో బెంగళూరుకు చెందిన దిశా రవి(21) అనే స్టూడెంట్, క్లైమెట్ యాక్టివిస్ట్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు సోలదేవనహళ్లిలోని ఇంట్లో ఆమెను శనివారం అదుపులోకి తీసుకున్న ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు ఆదివారం ఢిల్లీలోని పాటియాలా హౌస్​ కోర్ట్​లో ప్రవేశపెట్టారు. ఆమెను 7 రోజుల పాటు విచారణకు అప్పగించాలని కోరగా, మెజిస్ట్రేట్ దేవ్ సరోహా 5 రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించారు. గ్రెటా అప్ లోడ్ చేసిన టూల్ కిట్ ను దిశ ఎడిట్ చేసి, ఆన్ లైన్ లో షేర్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రైతులకు మద్దతు పేరుతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరిగిందని, ఇందులో ఖలిస్తానీ టెర్రరిస్టులకు అనుకూలమైన పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ (పీజేఎఫ్), ఇతర వ్యక్తుల పాత్ర కూడా ఉందని ఢిల్లీ పోలీసులు ఈ నెల 4న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

రెండు లైన్లే ఎడిట్ చేశా..

టూల్ కిట్ లో తాను రెండు లైన్లను మాత్రమే ఎడిట్ చేశానని, తాను ఏ తప్పూ చేయలేదని కోర్టు రూంలో దిశ కంటతడి పెట్టినట్లు ‘ఏఎన్ఐ’ వెల్లడించింది. రైతుల ఉద్యమాన్ని చూసి ఇన్ స్పైర్ అయిన తాను వారికి సపోర్ట్ చేయాలని మాత్రమే అనుకున్నట్లు కోర్టుకు చెప్పిందని పేర్కొంది.

ఇందులో ఏముంది?  

రైతుల ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ గ్రెటా థన్ బర్గ్ అప్ లోడ్ చేసిన టూల్ కిట్ (డాక్యుమెంట్)లో జనవరి 26న చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలు, ఆన్ లైన్, స్ట్రీట్ ప్రొటెస్టులకు సంబంధించిన వివరాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ‘‘జనవరి 26న హ్యాష్ ట్యాగ్ ల ద్వారా డిజిటల్ స్ట్రైక్ చేయాలి. ప్రధాని మోడీ, అగ్రికల్చర్ మినిస్టర్ తోమర్ ను ట్యాగ్ చేయాలి. 23వ తేదీ నుంచి ట్వీట్ల తుఫానులు సృష్టించాలి. 26వ తేదీన ఫిజికల్ యాక్షన్ లోకి దిగాలి. ఢిల్లీలోకి వెళ్లే రైతులతో కలవాలి. లేదా ర్యాలీని చూడాలి. తిరిగి ఢిల్లీ బార్డర్లకు రావాలి” అని టూల్ కిట్​లో పేర్కొన్నట్లు చెప్తున్నారు. వివిధ దేశాల్లోని ఇండియన్ ఎంబసీల ముందు, మనదేశంలోని మీడియా సంస్థల ఆఫీసుల ముందు, గవర్నమెంట్ బిల్డింగుల ముందు, అదానీ, అంబానీ కంపెనీల ఆఫీసుల ముందూ ఎప్పుడు? ఎలా నిరసనలు చేయాలన్నది కూడా వివరించారని చెప్పారు.

టూల్ కిట్ లో చెప్పినట్లే 26న నిరసనలు

జనవరి 26న ఢిల్లీలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం, ఎర్రకోట దాకా సాగిన ర్యాలీలో హింసాత్మక ఘటనలు జరగడం తెలిసిందే. దాదాపు 500 మంది పోలీసులు గాయపడ్డారు. ఎర్రకోటపై జాతీయ జెండా పక్కన నిరసనకారులు తమ జెండాను ఎగురవేశారు. గ్రెటా థన్​బర్గ్ షేర్ చేసిన టూల్ కిట్​లో చెప్పినట్లే.. రిపబ్లిక్ డే నాడు ఢిల్లీలో నిరసనలు, విధ్వంసం జరిగిందని పోలీసులు ఆరోపిస్తున్నారు.  గవర్నమెంట్​పై వ్యతిరేకతను వ్యాప్తి చేయడం, మతాలు, కల్చరల్​ తేడాలు టార్గెట్ చేసి విద్వేషాలను రెచ్చగొట్టడం కోసమే టూల్ కిట్ ను రూపొందించినట్లు పోలీసులు చెప్పారు. ఈ టూల్ కిట్​ను ఖలిస్తానీ టెర్రరిస్టులకు అనుకూల సంస్థలు, వ్యక్తులు రూపొందించినట్లు వెల్లడించారు.

వాట్సాప్ గ్రూపుతో కోఆర్డినేషన్

గూగుల్ డాక్యుమెంట్ తయారీ, వ్యాప్తిలో దిశా రవి కీలక కుట్రదారుగా ఉందని పోలీసులు తెలిపారు. ఇందుకోసం ఆమె వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేసింద ని, దాంతోనే కొంతమందితో కలిసి టూల్ కిట్ తయారు చేసిందని చెప్పారు. ఆమె ల్యాప్ టాప్, మొబైల్ సీజ్ చేశామన్నారు. ఆమె ఎవరెవరితో టచ్ లో ఉంది? ఇందులో ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

టూల్ కిట్ అంటే ఏమిటి?

ఏదైనా ఒక సమస్య, దాని విషయంలో తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూ రూపొందించిన బుక్ లెట్ లేదా డాక్యుమెంట్ నే టూల్ కిట్ అంటారు. సంబంధిత విషయంపై ఫీల్డ్ లెవల్ లో చేపట్టాల్సిన చర్యలు, కార్యక్రమాలను ఇది వివరిస్తుంది. థియరీని ఆచరణలో పెట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఢిల్లీలో రైతుల ఉద్యమానికి మద్దతుగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన టూల్ కిట్​ను గ్రెటా షేర్ చేసింది.

ప్రొఖలిస్తాన్ సంస్థ కుట్ర

ఇండియన్ గవర్నమెంట్​కు వ్యతిరేకంగా సోషల్, కల్చరల్, ఎకనామిక్ వార్ వచ్చేలా చేసేందుకు ఈ టూల్ కిట్​ను ఖలిస్తాన్ అనుకూల వ్యక్తులు తయారు చేశారంటూ ఫిబ్రవరి 4న పోలీసులు కేసు నమోదు చేశారు. దేశద్రోహం, నేరపూరిత కుట్ర, సమాజంలోని వర్గాల మధ్య వైరం పెంచడం వంటి ఆరోపణల కింద కేసు పెట్టారు. ఖలిస్తాన్ టెర్రరిస్టులకు అనుకూలంగా ఉండే ‘‘పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ (పీజేఎఫ్)” అనే సంస్థ ఆధ్వర్యంలోనే ఈ టూల్ కిట్ తయారైందని పోలీసులు పేర్కొన్నారు.