- చేదు అనుభవం ఎదుర్కొన్న బెంగళూరు టెకీ
- లింక్డ్ ఇన్‌లో పెట్టిన పోస్టు వైరల్
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో వివరిస్తూ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్ మాజీ ఉద్యోగి శ్రీనివాసన్ జయరామన్ లింక్డ్ ఇన్‌లో పెట్టిన పోస్టు వైరల్ అయింది. జొమాటో, స్విగ్గీ ద్వారా ఫుడ్ డెలివరీ చేసే వాళ్ల కష్టాలను ఈ పోస్టు ద్వారా కళ్లకు కట్టారు. వారి ఇబ్బందుల లిస్టు రాశారు. శ్రీనివాసన్ ఇటీవల జాబ్ మారారు. అప్పుడు వారం వరకు ఖాళీ సమయం దొరికింది. ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా చేరారు. అప్పటి నుంచి మొదలయ్యాయి ఆయన తిప్పలు. పెట్రోల్ ధరలు మొదలుకొని స్పీడ్‌గా ఫుడ్ డెలివరీ చేయడం వరకు ఎన్నో కష్టాలు పడ్డారు. తను జొమాటోలో పనిచేసిన కాలంలో ఎదుర్కొన్న సమస్యల చిట్టాను తయారు చేసి లింక్డ్ ఇన్‌లో పెట్టేశారు. అవేంటో చదవండి.
- డెలివరీ ఏజెంట్లు కాలంతోపాటు పరుగెత్తాలి. త్వరగా డెలివరీ ఇవ్వడానికి దూసుకెళ్లాలి. ఇక నుంచి తాము కొన్ని ఆహార పదార్థాలను పది నిమిషాల్లోనే డెలివరీ ఇస్తామని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల చేసిన ప్రకటనపై నెటిజన్లు మండిపడ్డారు. పది నిమిషాల్లోనే డెలివరీ ఇచ్చి తీరాలని ఉద్యోగులపై ఒత్తిడి తేబోమని ఆయన వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
- ఒక రద్దీ ప్రాంతంలో గంటలో మూడు ఫుడ్ పార్సిళ్లను డెలివరీ చేయాల్సి వచ్చిందని జయరామన్ పేర్కొన్నారు.
- చాలా మంది కస్టమర్లు తమ అడ్రస్‌లను కరెక్ట్‌గా చెప్పరు. లొకేషన్ వివరాలు సరిగ్గా ఉండవు. ఫోన్ నంబర్లను అప్డేట్ చేయడం లేదు.
- ఎక్కువ దూరం వెళ్లాల్సి రావడం చాలా పెద్ద సమస్య. తరచూ ఎదురయ్యే ఇబ్బంది ఇది. ఒకసారి జయరామన్ ఫుడ్ డెలివరీ కోసం ఏకంగా 14 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చింది.
- పెద్దగా తెలియని ప్రాంతమైనా కష్టమే! అక్కడి రెస్టారెంట్ల అడ్రస్‌ను పట్టుకోవడం ఇబ్బందే! గూగుల్ మ్యాప్స్సాయంతో వెతికినా వాటి పత్తా దొరకదు.
- పెట్రోల్ ధరలు పెరగడం వల్ల జేబుపై భారం ఎక్కువవుతోంది. ‘‘డెలివరీ ఏజెంట్లకు సాయం చేయండి. పెరిగిన పెట్రోల్ ధరలను కంపెనీలే భరిస్తాయనే వార్తలను చూశాను. అదే నిజమైతే చాలా బాగుంటుంది. వాళ్లను తప్పక ఆదుకోవాలి” అని జయరామన్ ముగించారు.
టెక్నికల్ సమస్యలతో స్విగ్గీ, జొమాటో డౌన్
ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో లు టెక్నికల్ సమస్యల కారణంగా బుధవారం చాలా సేపు పనిచేయలేదు. దేశవ్యాప్తంగా ఈ సమస్య ఏర్పడింది. ఈ రెండు స్టార్టప్‌లూ తమ బిజినెస్ కోసం అమెజాన్ వెబ్సర్వీసెస్ ఉపయోగిస్తాయి. అమెజాన్క్లౌడ్ సర్వీసులు సరిగ్గా పనిచేయకపోవడంతో వీటి సేవలు ఆగిపోయాయి. దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా కంప్లైంట్స్ చేశారు. ఆర్డర్లు ఇవ్వడానికి మెనూ కనిపించడం లేదని తెలిపారు. టెంపరరీగా టెక్నికల్ సమస్య వచ్చిన మాట నిజమేనని, దీనిని పరిష్కరించడానికి తమ టీమ్ పనిచేస్తోందని స్విగ్గీ వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇవి రెండు అన్యాయమైన వ్యాపార పద్ధతులను పాటిస్తున్నాయని నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చేసిన ఫిర్యాదుపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ జరుపుతున్నది. స్విగ్గీ, జొమాటో కొన్ని రెస్టారెంట్ల ఆర్డర్లకే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయని అసోసియేషన్ ఆరోపించింది. విపరీతంగా కమీషన్లు తీసుకొని డిస్కౌంట్లు ఇస్తున్నాయని విమర్శించింది. దీనిపై సీసీఐ స్పందిస్తూ రెస్టారెంట్లతో ఫుడ్ డెలివరీ యాప్‌లు ప్రత్యేక అగ్రిమెంట్లు చేసుకోవడం వల్ల కొత్త వాటికి ఇబ్బంది అవుతుందని పేర్కొంది.