మంచి నీళ్లతో కార్లు కడిగితే రూ.5 వేలు ఫైన్.. వాటర్ బోర్డు కఠిన ఆంక్షలు

మంచి నీళ్లతో కార్లు కడిగితే రూ.5 వేలు ఫైన్.. వాటర్ బోర్డు కఠిన ఆంక్షలు
  • నిర్మాణాలు, గార్డెనింగ్, ఫౌంటేన్​లలో వాడినా పెనాల్టీ తప్పదు
  • డ్రింకింగ్ వాటర్ వాడకంపై బెంగళూరులో వాటర్ బోర్డు ఆంక్షలు

బెంగళూరు: సమ్మర్‎లో తాగు నీళ్లకు కరువు ఏర్పడకుండా బెంగళూరు వాటర్ బోర్డు ముందస్తు చర్యలు చేపట్టింది. డ్రింకింగ్ వాటర్ వేస్ట్ చేస్తే భారీగా పెనాల్టీ విధిస్తామని ప్రకటించింది. కార్లు కడిగేందుకు, గార్డెనింగ్‎కు, ఫౌంటేన్‎లు, ఇతరత్రా సరదా పనులకు తాగునీటిని వినియోగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. నిర్మాణ పనులకు కూడా డ్రింకింగ్ వాటర్​వాడొద్దని స్పష్టం చేసింది.

సినిమా హాల్స్, మాల్స్‎లో క్లీనింగ్‎కు తాగునీళ్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. వాటర్ వేస్ట్ చేస్తూ రెండోసారి పట్టుబడితే అదనంగా మరో 5 వేలు పెనాల్టీ విధిస్తామని హెచ్చరించింది. ఆపైకూడా వేస్ట్ చేసినవాళ్లకు రోజుకు రూ.500 చొప్పున జరిమానా విధిస్తామంది. వాటర్ బోర్డ్ చట్టం కింద రూల్స్ అమలు చేస్తామని చెప్పింది. తాగునీళ్లను వృథా చేస్తుంటే తమ కాల్ సెంటర్ 1916కు సమాచారం ఇవ్వాలని బెంగళూరు వాసులను కోరింది.

ఓవైపు పెరుగుతున్న టెంపరేచర్లు, మరోవైపు వర్షాలు లేక భూగర్భ జలాలు పడిపోయాయని వాటర్ బోర్డు ఆందోళన వ్యక్తంచేసింది. పోయినేడాది నీళ్ల కరువుతో బెంగళూరులో 14 వేల బోర్లు ఎండిపోయాయని, ఈసారి తాగునీళ్లను పొదుపుగా వాడుకోవాలని సూచించింది. ఈ ఎండాకాలంలో నీళ్ల కొరత ఏర్పడొచ్చని ఐఐఎస్సీ సైంటిస్టులు కూడా హెచ్చరించారని బోర్డు గుర్తుచేసింది.