ఎడ్యుకేషన్​తోనే.. బంగారు తెలంగాణ

బంగారు తెలంగాణ సాధించాలంటే ఎడ్యుకేషన్​ చాలా కీలకం. ఒక ప్రాంతం సమగ్రాభివృద్ధి చాలావరకు ఆ ప్రాంతంలోని ఎడ్యుకేషన్​ సిస్టమ్​ పైనే ఆధారపడి ఉంటుంది. అందులోనూ గవర్నమెంట్​ ఎడ్యుకేషన్​ సిస్టమ్​ బలంగా ఉండాలి. విద్యా వ్యాపార దోపిడీని అరికట్టి, గవర్నమెంట్, జెడ్పీ స్కూళ్ల స్టూడెంట్లకు నాణ్యమైన విద్యను అందించాలంటే మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ వాటిని రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చడమే పరిష్కారం.

ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్​లో ఎడ్యుకేషన్​ ఒక బిజినెస్​గా మారిపోయింది. ప్రైవేటు విద్యా వ్యాపారం.. అందులోనూ ఆంధ్రా కార్పొరేట్​ బిజినెస్ తెలంగాణ పల్లెలకూ విస్తరిస్తోంది. చిన్న చేపను పెద్ద చేప తిన్నట్లు కార్పొరేట్ సంస్థలు కొత్త జిల్లా కేంద్రాల్లో వాలిపోతూ నిరుద్యోగులు బతుకుదెరువు కోసం పెట్టుకున్న చిన్నచిన్న విద్యాసంస్థల నోట్లో మట్టి కొడుతున్నాయి. ఒక సాధారణ వ్యక్తి సంపాదనలో 70 శాతం ఇద్దరు పిల్లల చదువులకే ఖర్చవుతోంది. జిల్లా కేంద్రాల్లో కూడా 4వ తరగతి స్టూడెంట్​కు ట్యూషన్ ఫీజు రూ.31 వేలు, టెక్స్ట్​ బుక్స్, స్కూల్ డ్రెస్, ఇతర సామగ్రికి రూ.10 వేలు, స్కూల్ బస్సుకు రూ.11 వేలు ఇలా మొత్తం రూ.52 వేలు వసూలు చేస్తున్నారు. వీటికి అదనపు వసూళ్లు కూడా ఉన్నాయి. ఇది నాన్ -రెసిడెన్షియల్ స్కూళ్లకే. రెసిడెన్షియల్ స్కూళ్లయితే ఒక్కొక్కరికీ రూ.లక్ష కావాల్సిందే. సంపాదనలో 70 శాతం పిల్లల చదువుకే పోతే, ఇతర ఖర్చులకు డబ్బులు ఎక్కడివి? దీంతో అప్పులు చేయాల్సి వస్తోంది. కరోనా ఎఫెక్ట్​తో జనం ఇబ్బందులు పడుతుంటే ఆన్​లైన్​ ఎడ్యుకేషన్​ పేరు చెప్పి దోపిడీని రాచమార్గంలో కొనసాగిస్తున్నారు. విద్యా వ్యాపారాన్ని అడ్డుకోవాలంటే విద్యా వ్యవస్థను ప్రభుత్వం బలోపేతం చేయడమే పరిష్కారం.

రెసిడెన్షియల్​ స్కూళ్లలో మంచి రిజల్ట్స్

స్టూడెంట్లు, టీచర్ల నిష్పత్తి(పీటీఆర్) ప్రైమరీ స్కూల్​లో 1:18.9, అప్పర్​ ప్రైమరీ స్కూల్స్​లో 1:14.12, హైస్కూల్స్​లో 1:17.85గా ఉంది. పీటీఆర్ సర్కారు స్కూళ్లలో చాలా బాగుంది. అలాంటప్పుడు ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. నేషనల్ శాంపిల్ సర్వే 75వ రౌండ్ 2018 నాటి ఫలితాల్లో కొన్ని ఆశ్చర్యకర విషయాలు కనిపించాయి. మూడో తరగతిలో 69% మ్యాథ్స్, 67% ఈవీఎస్, 68% లాంగ్వేజెస్​లో మాత్రమే స్టూడెంట్లు ఆశించిన స్థాయిలో లక్ష్యాలను చేరుకున్నారు. 5వ తరగతిలో 56% మ్యాథ్స్, 54% సోషల్, 57% లాంగ్వేజెస్​లో ఆశించిన ఫలితాలను అందుకున్నారు. 8వ తరగతిలో 37% మ్యాథ్స్, 40% సోషల్, 53% లాంగ్వేజెస్​లో మాత్రమే ఆశించిన ఫలితాలను సాధించారు. అంటే ఎడ్యుకేషన్​లో ఆశించిన ఫలితాలను అందరూ అందుకోవడం లేదు. టెన్త్​ ఫలితాలు చూస్తే 2018–19 విద్యాసంవత్సరంలో 92.43% మంది పాస్​ అయ్యారు. దీనిలో బీసీ రెసిడెన్షియల్ వెల్ఫేర్స్ స్కూళ్లలో అత్యధికంగా 98.7% మంది ఉత్తీర్ణులయ్యారు. సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్ స్కూళ్లలో 96.56%, కేజీబీవీల్లో 95.07%, ప్రైవేట్​ స్కూళ్లలో 93.65%, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో 93.09%, ప్రభుత్వ, జెడ్పీ స్కూల్స్​91.26% ఫలితాలను సాధించాయి. రెసిడెన్షియల్స్ స్కూల్స్​లో ఎక్కువ, ప్రభుత్వ, జెడ్పీ స్కూళ్లలో తక్కువ ఫలితాలు వచ్చాయి. దీనికి కారణాలు వెతకాల్సిన అవసరం, పరిష్కారాలు చూపాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇక ఇంగ్లిష్ మీడియంలో 94.32% పాస్​ కాగా, తెలుగు మీడియంలో 89.26%, ఉర్దూ మీడియంలో 84.63% ఉత్తీర్ణులయ్యారు.

ఏ ఒక్కరినీ బాధ్యులను చేయలేం

ఈ సమాచారం ప్రకారం రెండు విషయాలను గుర్తించాలి. ఒకటి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో​ఫలితాలు ప్రైవేట్, ప్రభుత్వ, జెడ్పీ స్కూళ్ల కన్నా ఎక్కువగా ఉన్నాయి. రెండోది ఇంగ్లిష్ మీడియంలో ఫలితాలు బాగున్నాయి. వెయ్యి వరకు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్​ ఉన్నాయి. మొత్తం సర్కారీ స్కూళ్లలో రెసిడెన్షియల్​ స్కూళ్లు 3.33% మాత్రమే. మొత్తం స్టూడెంట్లలో రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్నవారు కేవలం 10%. వీరు మాత్రమే ఆశించిన ఫలితాలను నాణ్యమైన మౌలిక సౌకర్యాల ద్వారా పొందుతున్నారు. ప్రభుత్వం నడుపుతున్న మిగతా 97.69% స్కూళ్లలో చదువుతున్న మిగిలిన స్టూడెంట్లకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు దక్కడం లేదు. నాణ్యమైన మౌలిక సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా? ప్రభుత్వ, జెడ్పీ స్కూళ్లలో స్టూడెంట్లు ఆశించిన ఫలితాలను ఎందుకు అందుకోలేకపోతున్నారు? ప్రైవేట్ స్కూళ్లకే స్టూడెంట్లు ఎందుకు ఎక్కువగా పోతున్నారు? దీనికి ఏ ఒక్కరినీ బాధ్యులను చేయలేం. టీచర్లు ఉంటే సౌలత్​లు ఉండవు, సౌలత్​లు ఉంటే టీచర్లు ఉండరు. టీచర్లు, సౌలత్​లు ఉంటే స్టూడెంట్లు ఉండరు.

అన్ని స్కూళ్లను ఒకే గొడుగు కిందికి తేవాలి

ఇక టీచర్లు ఏ కేడర్ లో నియమితులయ్యారో అందులోనే 20, 25 ఏండ్లు ప్రమోషన్ లేకుండా పనిచేయాల్సి వస్తోంది. దీంతో వారంతా నిరుత్సాహంలో ఉంటున్నారు. అటువంటి వారి నుండి ఫలితాలు ఎలా రాబట్టగలం? అందువల్ల అన్ని స్థాయిల్లో వెంటనే ప్రమోషన్స్ చేపట్టాలి. ఇంగ్లిష్ మీడియం లేకపోవడంతో ప్రభుత్వ, జెడ్పీ స్కూల్స్ స్టూడెంట్లను ఆకర్షించలేకపోతున్నాయి. అందువల్ల ఏపీ మాదిరిగా అన్ని ప్రభుత్వ, జెడ్పీ స్కూళ్లను ఇంగ్లిష్ మీడియంగా మార్చాలి. అన్ని స్కూళ్లను ఒకే గొడుగు కిందికి తేవాలి. అన్ని హైస్కూళ్లను దశలవారీగా రెసిడెన్షియల్ స్కూల్స్​గా మార్చాలి. స్కూళ్లలో మౌలిక వసతులకు స్థానిక ప్రజాప్రతినిధులను, అన్ని డిపార్ట్​మెంట్లను బాధ్యులను చేయాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా టీచర్లకు ట్రైనింగ్​ ఇవ్వాలి. ఆడపిల్లలకు 6వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రెసిడెన్షియల్స్ స్కూల్స్, కాలేజీలు ఉండాలి. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్​ను ప్రైమరీ, హైస్కూళ్లకు అనుసంధానించాలి. అన్ని సౌలత్​లు కల్పించిన తర్వాత ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, టీచర్ల పిల్లలను ప్రభుత్వ, జెడ్పీ స్కూళ్లలో చేర్చేలా ప్రోత్సహించాలి. అందరికీ నాణ్యమైన విద్యను అందిస్తే బంగారు తెలంగాణకు బాటలు వేసినట్లే.

రాష్ట్ర ఆర్థిక సర్వే–2020 ప్రకారం రాష్ట్రంలో 2018–19 విద్యా సంవత్సరం నాటికి 40,597 స్కూళ్లలో 58.71 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. ఇందులో ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లు 26,050 ఉన్నాయి. వీటిలో 20.47 లక్షల మంది చదువుతున్నారు. అలాగే 194 మోడల్ స్కూల్స్, 475 కేజీబీవీలు, 35 తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్, 237 సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, 125 ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ స్కూల్స్, 1,774 ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్ స్కూల్స్ తోపాటు మైనార్టీ, ఎయిడెడ్, సెంట్రల్ స్కూల్స్ మొత్తం కలిపి ప్రభుత్వ నిర్వహణలో 30,048 స్కూల్స్​లో 27.49 లక్షల మంది చదువుతున్నారు. మొత్తం స్టూడెంట్లలో ఇది 46.82 శాతం. ఇక రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రైవేటు స్కూల్స్ 10,369. వీటిలో 31.11 లక్షల మంది చదువుతున్నారు. మొత్తం స్టూడెంట్లలో ఇది 52.99 శాతం. ఒక ప్రభుత్వ స్కూల్​లో సగటున 91 మంది చదువుతుంటే.. ఒక ప్రైవేట్​ స్కూల్​లో 300 మంది వరకూ చదువుతున్నారు. అంటే ఎక్కువగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో తక్కువ మంది, తక్కువగా ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో ఎక్కువ మంది స్టూడెంట్లు చదువుతున్నారన్నమాట. ఇందులోనూ కొన్ని ప్రైవేట్ స్కూళ్ల గుత్తాధిపత్యమే నడుస్తోంది.

జుర్రు నారాయణ యాదవ్
టీటీయూ జిల్లాఅధ్యక్షుడు,మహబూబ్ నగర్