బర్లు, గొర్లు ఇస్తేనే బంగారు తెలంగాణా?.. కేసీఆర్ అబద్ధపు మాటలు నమ్మొద్దు

  • కాపలా కుక్కలా ఉంటానని మొత్తం దోచేసిండు
  • కాంగ్రెస్ స్టార్​ క్యాంపెయినర్​ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు : బతుకమ్మ చీరలు, బర్లు, గొర్లు ఇచ్చేస్తే రాష్ట్రం బంగారు తెలంగాణ అయిపోయినట్లేనా అని కాంగ్రెస్​ స్టార్​ క్యాంపెయినర్​, నల్గొండ కాంగ్రెస్​ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. సూర్యాపేట కాంగ్రెస్  పార్టీ సీనియర్ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి తో కలిసి శనివారం నల్గొండ మున్సిపాలిటీతో పాటు నల్గొండలో వెంకట్  రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మరో  పది రోజుల్లో సీఎం కేసీఆర్​ ఫామ్ హౌజ్​కు పోవడం ఖాయమన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్  నెరవేర్చలేదని విమర్శించారు. ‘‘మన రాష్ట్రం మనకి వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకున్నం. కానీ నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల వారిని కేసీఆర్  మోసం చేసిండు. తెలంగాణ వస్తే రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న సీఎం కేసీఆర్..  రాష్ట్రం మొత్తాన్ని దోచేసిండు. మళ్లీ కేసీఆర్​ మోసపు మాటలు నమ్మి మోసపోవద్దు. ఉద్యోగ నోటిఫికేషన్  లేక నిరుద్యోగులు తప్పుదారి పడుతున్నారు.

వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమే. మేము ప్రకటించిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తం. పదేళ్లు దోచుకొని తిని ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్​ లీడర్లు మళ్లీ తమకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నరు. వారు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుని కాంగ్రెస్ ను గెలిపించాలి. తెలంగాణ వచ్చాక కూడా కొత్త రేషన్  కార్డులు ఇవ్వలేదు. ఈ ఎన్నికలు మన బతుకులను మార్చే ఎన్నికలు. ఆలోచించి ఓటు వేయాలి”  అని వెంకట్  రెడ్డి పేర్కొన్నారు. ఇండస్ట్రియల్  పార్కు కోసం ప్రజల భూములు గుంజుకోవడానికి బీఆర్ఎస్  నేతలు వస్తున్నారని, వారితో జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. కలెక్టర్ తో మాట్లాడి ఇండస్ట్రియల్  పార్కు నిర్మాణాన్ని ఆపేస్తాననని హామీ ఇచ్చారు. డిసెంబర్ 10 నుంచి రూ.500కే గ్యాస్  సిలిండర్ ఇస్తామని, మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యేకి ఈసారి చరమగీతం పాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పట్టణ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.