GT20 Canada: గ్లోబల్ టీ20 కెనడా.. సూపర్ ఓవర్ ఆడనందుకు టోర్నీ నుంచి ఔట్

గ్లోబల్ టీ20 కెనడా 2024లో భాగంగా అనూహ్య సంఘటన ఒకటి చేసుకుంది. షకీబ్ అల్ హసన్ కెప్టెన్ గా ఉంటున్న బంగ్లా టైగర్స్ మిస్సిసౌగా.. టొరంటో నేషనల్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ జరగాల్సి ఉంది. శనివారం (ఆగస్ట్ 10) ఒంటారియోలోని బ్రాంప్టన్‌లోని జరగాల్సిన ఈ మ్యాచ్ వాతావరణ పరిస్థితుల కారణంగా జరగలేదు. దీంతో సూపర్ ఓవర్ ద్వారా విజేతను ఎంపిక చేయాలని నిర్ణయించారు.

బంగ్లా టైగర్స్ సూపర్ ఓవర్‌కు వెళ్లేందుకు నిరాకరించింది. మ్యాచ్ పూర్తిగా వాష్ అవుట్ అయితే.. షకీబ్ జట్టు లీగ్ టేబుల్‌లో ఎక్కువ స్థానంలో ఉన్నందున క్వాలిఫైయర్ 2కి చేరుకునేది. అయితే.. సూపర్ ఓవర్ ఆడేందుకు బంగ్లా టైగర్స్ నిరాకరించడంతో మ్యాచ్ టొరంటో నేషనల్స్‌ గెలిచినట్టు అంపైర్లు ప్రకటించారు. దీంతో బంగ్లా టైగర్స్ మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. 

అంతకముందు బ్రాంప్టన్ వోల్వ్స్, మాంట్రియల్ టైగర్స్ మధ్య జరగాల్సిన క్వాలిఫైయర్ 1 వర్షం కారణంగా రద్దయింది. దీంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన మాంట్రియల్ టైగర్స్ ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం (ఆగస్ట్ 11) జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టొరంటో నేషనల్స్‌ ఈ టోర్నీ విజేతగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన మాంట్రియల్ టైగర్స్ 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో టొరంటో నేషనల్స్‌ 15 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయి ఛేజ్ చేసింది.