‘సెలెంట్‎గా ఉంటే బెటర్’.. షేక్ హసీనాకు యూనస్ స్వీట్ వార్నింగ్

‘సెలెంట్‎గా ఉంటే బెటర్’.. షేక్ హసీనాకు యూనస్ స్వీట్ వార్నింగ్

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‎లో కూర్చుని రాజకీయ వ్యాఖ్యలు చేయడం మంచిదికాదని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఆమెను అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం కోరేదాకా ఆమె సైలెంట్‭గా ఉంటే మంచిదని సూచించారు. లేదంటే ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. 

భారత్‪తో తమ దేశానికి బలమైన, స్నేహపూర్వక సంబంధాలున్నాయని ఆయన గుర్తుచేశారు. గురువారం ఢాకాలో యూనస్ మీడియాతో మాట్లాడారు. ‘‘తాము హసీనాను అప్పంగించాలని కోరే వరకు ఆమె భారత్లోనే ఉన్నట్లయితే మాట్లాడకుండా సైలెంట్‬గా ఉండాలి. అంతేగానీ, లేనిపోనివి మాట్లాడి ఇరుదేశాల మధ్య ఇబ్బందులు తలెత్తేలా చేయొద్దు” అని యూనస్ పేర్కొన్నారు. 

హసీనాను విచారించాల్సిందే.. 

ప్రజాగ్రహానికి గురై హసీనా పారిపోయారని, ఆమెను తప్పకుండా తిరిగి బంగ్లాదేశ్‪కు రప్పిస్తామని యూనస్ చెప్పారు. ఆమె ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డారో అందరి ముందు విచారణ చేయాల్సి ఉందన్నారు. లేదంటే బంగ్లాదేశీయులు శాంతించరని పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం అందించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ న్యాయం జరగాలంటే హసీనాను తప్పకుండా దేశానికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. 

తాము భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నామని యూనస్ తెలిపారు. హసీనా నాయకత్వంతోనే బంగ్లా ప్రభుత్వం స్థిరంగా ఉంటుందనే అపోహను భారత్ వదిలేయాలని ఆయన కామెంట్ చేశారు. బంగ్లాలో ఎవరిపైనా మతపరమైన దాడులు జరగట్లేదని స్పష్టం చేశారు. హసీనా మద్దతుదారులుగా ఉన్న కొందరిపై మాత్రమే కొన్ని చోట్ల దాడులు జరిగాయన్నారు.