బంగ్లాదేశ్ ఆల్రౌండర్ నాసిర్ హొస్సేన్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అవినీతి అభియోగాలు మోపింది. 2021లో అబుదాబిలో జరిగిన టీ10 లీగ్ లో అతడు మరో ఏడుగురితో కలిసి అవినీతికి పాల్పడినట్లుగా ఐసీసీ నిర్దారించింది. అతనిపై చర్యలకు సిద్దమైంది.
అబుదాబి టీ10 లీగ్ 2021 ఎడిషన్‌లోని ఆరు మ్యాచ్‌లలో అతను పూణే డెవిల్స్‌కు నాయకత్వం వహించాడు. టీ10 లీగ్ లో పోటీలో పూణె డెవిల్స్ ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఒకదానిలో విజయం సాధించి చివరి స్థానంలో నిలిచింది.
నాసిర్‌తో పాటు అభియోగాలు మోపబడిన ఏడుగురిలో క్రిషన్ కుమార్ చౌదరి, పరాగ్ సంఘ్వి (డెవిల్స్ సహ-యజమానులలో ఇద్దరు), రిజ్వాన్ జావేద్, సాలియా సమన్ (ఇద్దరు దేశీయ ఆటగాళ్ళు), అలాగే అసర్ జైదీ (బ్యాటింగ్ కోచ్), సన్నీ ధిల్లాన్ ( అసిస్టెంట్ కోచ్) మరియు షాదాబ్ అహ్మద్ (టీమ్ మేనేజర్) ఉన్నారు.
కాగా హొసైన్ 2011లో బంగ్లాదేశ్ తరపున అరంగేట్రం చేశాడు. 19 టెస్టులు, 65 వన్డేలు 31 టీ20లలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. హొస్సేన్ చివరిసారిగా 2017లో బంగ్లాదేశ్ తరపున ఆడాడు.