కొలంబో : వరుసగా రెండు విక్టరీలతో ఫైనల్ చేరి ఆసియా కప్ సూపర్–4 ఆఖరి మ్యాచ్‌లో ప్రయోగాలు చేసిన ఇండియాకు బంగ్లాదేశ్ ఝలక్ ఇచ్చింది. ఛేజింగ్‌లో శుభ్‌మన్ గిల్ (133 బాల్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 121) సూపర్ సెంచరీ, అక్షర్ పటేల్ (42) పోరాటంతో గెలుపు ముంగిట నిలిచిన టీమిండియాను పేసర్ ముస్తాఫిజుర్ (3/50) దెబ్బకొట్టాడు. దాంతో, శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లా 6 రన్స్ తేడాతో ఇండియాపై నెగ్గింది. టాస్ ఓడిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 265/8 స్కోరు చేసింది. కెప్టెన్ షకీబ్ (80), తౌహిద్ హృదోయ్ (54), నసూమ్ అహ్మద్ (44) రాణించారు. తర్వాత ఇండియా 49.5 ఓవర్లలో 259 రన్స్‌కు ఆలౌటైంది. షకీబ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన బంగ్లా ఊరట విజయంతో టోర్నీని ముగించింది. ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీలంకతో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.
షకీబ్ అదుర్స్..
ఇప్పటికే ఫైనల్ బెర్త్ దక్కడంతో ఈ మ్యాచ్‌లో ఇండియా కోహ్లీ, హార్దిక్, బుమ్రా, కుల్దీప్, సిరాజ్‌కు రెస్ట్ ఇచ్చి తిలక్, సూర్య, షమీ, శార్దూల్, ప్రసిధ్‌ను ఆడించింది. టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాను ఆరంభంలో ఇండియా బౌలర్లు షమీ (2/32), శార్దూల్ (3/65) బాగా కట్టడి చేశారు. లైన్ అండ్ లెంగ్త్, స్వింగ్‌తో తన్జీద్ (13), లిటన్ దాస్ (0), అనాముల్ (4), మెహిదీ హసన్ (13)ను దెబ్బకొట్టారు. దీంతో 14 ఓవర్లలో బంగ్లా 59/4తో కష్టాల్లో పడింది. ఈ దశలో షకీబ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అక్షర్ (1/47) బౌలింగ్‌లో వరుస సిక్సర్లతో జోష్ పెంచిన షకీబ్‌కు రెండో ఎండ్‌లో తౌహిద్ అండగా నిలిచాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు కీలకమైన 101 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఇక ఓకే అనుకున్న టైమ్‌లో శార్దూల్, జడేజా (1/53) వరుస ఓవర్లలో షకీబ్, షమీమ్ హుస్సేన్ (1)ను పెవిలియన్‌కు పంపడంతో స్కోరు 161/6గా మారింది. చివర్లో నసూమ్ అహ్మద్ నిలకడగా ఆడాడు. తౌహిద్తో ఏడో వికెట్‌కు 32 రన్స్, మెహిదీ హసన్ (29 నాటౌట్)తో ఎనిమిదో వికెట్‌కు 45 రన్స్ జోడించాడు. తన్జీమ్ (14 నాటౌట్) కూడా మెరవడంతో బంగ్లా మంచి టార్గెట్‌ను నిర్దేశించింది.
గిల్, అక్షర్ దంచినా..
ఛేజింగ్‌లో గిల్ బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నా మిగతా వారి నుంచి సరైన సహకారం అందలేదు. కొత్త పేసర్ తన్జీమ్ దెబ్బకు ఇన్నింగ్స్ రెండో బాల్‌కే రోహిత్ (0) డకౌట్‌కాగా, మూడో ఓవర్‌లో తిలక్ వర్మ (5) వెనుదిరిగాడు. దీంతో 17/2 వద్ద వచ్చిన కేఎల్ రాహుల్ (19) మూడో వికెట్‌కు 57 రన్స్ జోడించి ఔటయ్యాడు. పోరాటం ఆపని గిల్.. ఇషాన్ (5)తో ఫోర్త్ వికెట్‌కు 20, సూర్య (26)తో ఐదో వికెట్‌కు 45 రన్స్ జోడించి టీమ్‌ను రేసులోకి తెచ్చాడు. కానీ ఇషాన్, సూర్యతో పాటు జడేజా (7) వికెట్ పడటంతో ఇండియా 170/6తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో అక్షర్ మంచి సహకారం అందించాడు. 117 బాల్స్‌లో సెంచరీ చేసిన గిల్.. 44వ ఓవర్‌లో భారీ సిక్సర్ బాది ఆ వెంటనే మరో షాట్‌కు యత్నించి లాంగాన్‌లో క్యాచ్ ఇచ్చాడు. అప్పటికి 38 బాల్స్‌లో 57 రన్స్ అవసరం కాగా అక్షర్ 4, 6తో శార్దూల్ (11) సింగిల్స్‌తో విజయానికి చేరువగా తెచ్చారు. కానీ 12 బాల్స్‌లో 17 రన్స్ కావాల్సిన దశలో ముస్తాఫిజుర్ శార్దూల్, అక్షర్‌ను ఔట్ చేయగా లాస్ట్ ఓవర్లో షమీ (6) రనౌటయ్యాడు.
తిలక్ వచ్చాడు.. కానీ
తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ వన్డేల్లోకి కూడా వచ్చేశాడు. బంగ్లాతో మ్యాచ్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ.. తిలక్‌కు క్యాప్ అందజేశాడు. టీ20, వన్డేల్లో విరాట్ ప్లేస్‌లోనే అతను టీమ్‌లోకి రావడం విశేషం. వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్న శ్రేయస్ అయ్యర్‌కు బ్యాకప్‌గా తిలక్‌ను వన్డేల్లో పరీక్షిస్తున్నారని తెలుస్తోంది. కానీ, ర్లాండ్‌పై మూడు టీ20ల్లో ఫెయిలైన తిలక్ ఆడిన తొలి వన్డేలోనూ ఫెయిలవడం కాస్త నిరాశ కలిగించే అంశం.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్ : 50 ఓవర్లలో 265/8 (షకీబ్ 80, తౌహిద్ 54, శార్దూల్ 3/65). ఇండియా: 49.5 ఓవర్లలో 259 ఆలౌట్ (గిల్ 121, అక్షర్ 42, ముస్తాఫిజుర్ 3/50, తన్జీమ్ 2/32).